విజయవాడ: అంబులెన్స్‌లో నుంచి ఆక్సిజన్ సిలిండర్ మార్చుతుండగా.. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి 108 వాహనం కాలిపోయింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం దొనబండ పెట్రోల్‌బంక్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. మూడు రోజుల కిందట 108 వాహనం మొరాయించడంతో అధికారులు ఆ వాహనాన్ని దొనబండ పెట్రోల్‌బంక్ సమీపంలో వదిలి వెళ్లారు. అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ అవసరం రావడంతో.. బుధవారం అర్ధరాత్రి చెడిపోయిన వాహనంలోని సిలిండర్‌ను మరో వాహనంలోకి మార్చే ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ మంటలంటుకున్నాయి.
ఆ వాహనంలో డ్రైవర్‌తో పాటు వైద్య సిబ్బంది ఉన్నారు. అప్రమత్తమైన వీళ్లు వెంటనే వాహనాన్ని పెట్రోల్‌బంక్ నుంచి దూరంగా తీసుకెళ్లారు. వారు అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 108 వాహనం పూర్తిగా కాలిపోయింది.