లక్ష్మీపతి మృతదేహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి
సాక్షి, తిరుపతి తుడా : అమ్మ ఆలన, నాన్న లాలన ఎరుగని వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు తిరుపతి ఎస్టీవి నగర్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి ఎం.లక్ష్మీపతి. కొన్నాళ్ల పాటు తన పెద్దమ్మ ఆలనాపాలనా చూసింది. ఆమె ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో ఇబ్బందులు తప్పలేదు. అయితే లక్ష్మీపతి తెలివితేటలను గుర్తించి ఉపాధ్యాయులు అతడికి చేయూతనిచ్చారు. ఏలోటూ రానీయకుండా విద్యనందించడంతో పాటు అతని ప్రతిభకు పదును పెట్టారు. సరికొత్త ఆయుధాల సృష్టికర్త కావాలన్న అతని కలలను సాకారం చేసుకునే దిశగా ప్రోత్సహించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన ప్రతిభను చాటుతూ గురువులు మెచ్చే శిష్యుడిగా పేరుగడించాడు. ఇంతలోనే విధి చిన్నచూపు చూసింది. అనారోగ్యంతో మృత్యువాడ పడ్డాడు. లక్ష్మీపతికి ఉపాధ్యాయులే తల్లిదండ్రులై దహన సంస్కారాలు నిర్వహించారు. తోటి విద్యార్థులే తోబుట్టువులై ఆఖరి ఘట్టాన్ని పూర్తి చేశారు. ఈ విషాద సంఘటన బుధవారం తిరుపతిలో చోటు చేసుకుంది.
తిరుపతిలోని శ్రీపండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న లక్ష్మీపతి అనారోగ్యంతో మృతి చెందాడు. చెన్నైలో జరుగుతున్న దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు సిద్ధమైన లక్ష్మీపతి స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ఉపాధ్యాయులు హుటాహుటిన అతడిని మంగళవారం స్విమ్స్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా ఊహించని రీతిలో అనారోగ్య సమస్యలు బైటపడటం టీచర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. లక్ష్మీపతి గుండెకు రెండు రంధ్రాలు, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంతేకాకుండా లివర్ పూర్తిగా చెడిపోయిందని, బ్లడ్ ఇన్‌ఫెక్షన్ వంటి తీవ్ర సమస్యలున్నట్లు తేలింది. చికిత్స ప్రారంభించినప్పటికీ అతని శరీరం సహకరించకపోవడంతో బుధవారం అతను కన్నుమూశాడు.
అందుకున్న సర్టిఫికెట్లు, మెమెంటోలతో లక్ష్మీపతి
ఉపాధ్యాయులే తల్లిదండ్రులై..
చిన్నప్పటి నుంచే లక్ష్మీపతి చూపుతున్న తెలివితేటలకు తోటి విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యచకితులయ్యేవారు. తల్లిదండ్రులు లేని అతనికి ఉపాధ్యాయులే తల్లిదండ్రులై అక్కున చేర్చుకున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయిని రేణుకాదేవి మూడో తరగతి నుంచి అన్నీ తానై లక్ష్మీపతికి అవసరమయ్యే అన్ని సదుపాయాలను సమకూర్చారు. ఆమెతో పాటు మరికొందరు టీచర్లు లక్ష్మీపతికి తోడుగా నిలిచి ప్రోత్సహించారు. సైన్స్‌పై ఆసక్తి చూపుతున్న లక్ష్మీపతికి అవసరమైన పరిశోధన సామగ్రిని ఉపాధ్యాయులు సమకూర్చారు.
కన్నీటి సంద్రమైన పాఠశాల
లక్ష్మీపతి ఇక లేడు– అని తెలుసుకున్న టీచర్లు, తోటి విద్యార్థులు తల్లడిల్లిపోయారు. లక్ష్మీపతి భౌతికకాయాన్ని పాఠశాలలోనే సందర్శనార్థం ఉంచడంతో నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు తరలివచ్చి నివాళులర్పించారు. తోటి విద్యార్థులు భోరుమంటూ విలపించడం అక్కడ ఉన్న టీచర్లను సైతం కంటతడి పెట్టించింది. సాయంత్రం పాఠశాల నుంచి గోవిందధామం వరకు అంతిమయాత్రగా లక్ష్మీపతి భౌతికకాయాన్ని తరలించగా ఎన్‌సీసీ క్యాడెట్లు గౌరవ వీడ్కోలు పలికారు. గోవిందధామం వద్ద ఎమ్మెల్యే యండపల్లి శ్రీనివాసులు, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు తదితరులుæ నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో టీచర్లు, విద్యార్థులు వందలాదిగా పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.
పరిశోధనలంటే ఆసక్తి
చిన్నతనం నుంచే సైన్స్ అంటే అమితమైన ఆసక్తి కనబరిచే లక్ష్మీపతి ఎప్పుడూ ఏదో ఒక పరిశోధనలతో పాఠశాల ల్యాబ్‌లో గడిపేవా డు. వెపన్ సైంటిస్ట్‌గా రాణించి దేశానికి సేవలందించాలని కలలు కనేవాడు. యుద్ధంలో సైనిక నష్ట నివారణకు వినూత్న ఆవిష్కరణలు చేయాలని, అలాగే రైతులకు మేలు చేయాలని తపించేవాడు. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో బాల మేధావిగా, బాల శాస్త్రవేత్తగా పలువురి ప్రశంసలందుకున్నాడు. తాను ఆవిష్కరించిన పలు సైన్స్ నమూనాలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఉత్తమ విద్యార్థిని కోల్పోయాం
లక్ష్మీపతి చదువులో బాగా రాణించేవాడు. ఎప్పుడు ఏదో ఒక ప్రయోగం చేస్తూ వినూత్న ఆవిష్కరణతో అబ్బురపరిచేవాడు. తన మేధాశక్తితో స్కూలుకు పేరుప్రతిష్టలు తెచ్చాడు. పెద్దయ్యాక దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త అవుతాడని భావించాం. ఇలా చనిపోతాడని ఊహించనేలేదు. ఒక ఉత్తమ విద్యార్థిని మేమంతా కోల్పోయాం.
–పి.వరలక్ష్మి, ప్రధానోపాధ్యాయిని, ఎస్పీజేఎన్‌ఎం ఉన్నత పాఠశాల
కన్న బిడ్డలా చూసుకున్నా
లక్ష్మీపతిని కన్నబిడ్డలా చూసుకున్నా. అతనికి తల్లిదండ్రులు లేకపోవడంతో మూడో తరగతి నుంచి చదివిస్తూ నా చేతులతో పెంచాను. మిగిలిన ఉపాధ్యాయులు కూడా అదే స్థాయిలోనే వెన్నుతట్టి ప్రోత్సహించారు. అనారోగ్య సమస్యను ముందుగా గుర్తించి ఉంటే అతనిని కాపాడుకునేవాళ్లం. దేవుడు అన్యాయం చేసి మా నుంచి దూరం చేశాడు.
–రేణుకాదేవి, ఉపాధ్యాయిని
Comments
Please login to add a commentAdd a comment