* 11 మంది తహశీల్దార్లు బదిలీ
కాకినాడ సిటీ : అవసరం మేరకు బదిలీలు నిర్వహించుకోవాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించడంతో ఆ ప్రకారం రెవెన్యూశాఖలో బుధవారం ప్రారంభమైన బదిలీల ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. తహశీల్దార్లుతోపాటు డిప్యూటీ తహశీల్దార్లను, ఆర్‌ఐ, వీఆర్వోలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియను ఆ శాఖ ఉన్నతాధికారులు చేపట్టారు. గురువారం రాత్రి వరకు రెవెన్యూ శాఖలో వివిధ కేడర్లలో అధికారులు, సిబ్బంది బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ ఏ కేడర్లలో ఎంతమందిని బదిలీ చేశారనే వివరాలు అందాల్సి ఉంది.
జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న 11 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ నీతూ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో పిఠాపురం తహశీల్దార్‌గా పనిచేస్తున్న ఎండీ రియాజ్‌హుస్సేన్ ఉప్పాడ కొత్తపల్లికి, అమలాపురం ఆర్డీవో కార్యాలయ ఏవోగా పనిచేస్తున్న బి. సుగుణ పిఠాపురం తహశీల్దార్‌గా, కాట్రేనికోన తహశీల్దార్‌గా పనిచేస్తున్న కె. రాజేంద్రప్రసాద్‌ను కలెక్టరేట్ బి సెక్షన్ సూపరింటెండెంట్‌గాను, కాజులూరు తహశీల్దార్‌గా పనిచేస్తున్న ఎం. వెంకటేశ్వర్లును కాట్రేనికోనకు, ఆత్రేయపురం తహశీల్దార్‌గా పనిచేస్తున్న బి. సత్యవతిని ఉప్పలగుప్తం మండలానికి బదిలీ చేశారు.
అదేవిధంగా కలెక్టరేట్ బి సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కేవీ సత్యనారాయణమూర్తి ఆత్రేయపురానికి, కిర్లంపూడి తహశీల్దార్‌గా పనిచేస్తున్న ఎస్. పోతురాజు కాజులూరుకు, కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రత్నకుమారి కిర్లంపూడి, దేవీపట్నం తహశీల్దార్‌గా పనిచేస్తున్న టివి సత్యనారాయణ తొండంగికి, ఉప్పలగుప్తం తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఎంవీవీ సత్యనారాయణ దేవీపట్నం మండలానికి బదిలీ అయ్యారు. అలాగే పశ్చిమగోదావరి నుంచి జిల్లాకు వచ్చిన తహశీల్దార్ వైకేవీ అప్పారావుకు అంబాజీపేట తహశీల్దార్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా...
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎవరినీ బదిలీలు చేయకూడదనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ దానికి విరుద్ధంగా రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ గురువారం కొనసాగింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ 2015లో గురువారం నుంచి కొత్త ఓటర్ల నమోదు ప్రారంభం కావడంతో జనవరి 15 వరకు బదిలీపై నిషేధం అమలులో ఉంది. అయితే దానికి విరుద్ధంగా జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు ఎన్నికల్లో భాగమైన ఓటర్ల నమోదులో పాల్గొనే బూత్ లెవెల్ అధికారులైన వీఆర్వోల బదిలీల పర్వాన్ని కొనసాగించారు. బదిలీల ప్రక్రియ నేపథ్యంలో బుధవారం నుంచి గురువారం రాత్రి వరకు కలెక్టరేట్‌లో పలువురు ఉద్యోగులు పడిగాపులు పడ్డారు.
కొనసాగిన బదిలీల పర్వం
Published Fri, Nov 14 2014 3:42 AM | Last Updated on Thu, Apr 4 2019 2:48 PM
Advertisement
Advertisement