
12.97శాతం రుణాలే మంజూరు
ఎస్‌ఎల్‌బీసీ నివేదన
లక్ష్యం రూ.56,019 కోట్లు.. ఇచ్చింది రూ.7,263 కోట్లు
1,514 మంది కౌలు రైతులకు రూ.3.81 కోట్ల రుణాలు
హైదరాబాద్:ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంట రుణాలన్నీ కలుపుకుని రూ.56,019 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం రూ.7,263 కోట్లు (12.97 శాతం) మాత్రమే రైతులకు రుణ రూపేణా అందించామని మంగళవారం నాటి ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంక ర్లు నివేదించారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 13 జిల్లాల్లో పునరుద్ధరించినవి, కొత్తవి కలిపి 1,86,885 మందికి రుణ అర్హత కార్డులు (ఎల్‌ఈసీ కార్డులు) జారీ చేయ గా, రుణాలిచ్చింది మాత్రం 1,514 మందికి రూ.3.81 కోట్లు మాత్ర మే. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత జిల్లా గుంటూరులో ఒక్క కౌలు రైతుకు రుణ అర్హతకార్డు రెన్యువల్ కాకపోగా, కొత్త కార్డు ఒక్కటీ మంజూరు చేయలేదు. ఇక్కడ పైసా రుణం కూడా కౌలు రైతులకు ఇవ్వలేదని ఎస్‌ఎల్బీసీ గ ణాంకాలు తెలియజేస్తున్నాయి. గుంటూరు, కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, నెల్లూ రు, కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లా ల్లో కౌలు రైతులకు రుణాలు అసలు మంజూరు చేయకుండా మొండిచెయ్యి చూపారు. తూర్పుగోదావరిలో 1,369 మంది కౌలు రైతులకు, ప్రకాశంలో 109, శ్రీకాకుళంలో 25, విజయనగరంలో 11 మంది కౌలు రైతులకు రుణాలిచ్చారు.
బీమా గడువు 31వరకు పెంచాలి..
రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అక్టోబర్ 31 వరకు పంటల బీమా గడువు పొడిగించాలని సమావేశంలో తీర్మానిం చారు. ఈ తీర్మానాన్ని కేంద్రం పరిధిలోని అగ్రికల్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పంపించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి హాజరైన వ్యవసాయ బీమా కార్పొరేషన్ ప్రతి నిధి గడువు పెంపు కుదరదని తేల్చి చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ దొరస్వామి సానుభూతితో అంశాన్ని పరిశీలించాలని కోరారు.
నిరర్ధక రుణాలుగా రూ. 32,516 కోట్లు
రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో కలిపి రూ.32,516 కోట్ల వ్యవసాయ రుణాలు నిరర్ధక రుణాలుగా మారిపోయినట్లు ఎస్‌ఎల్‌బీసీ నివేదిక వెల్లడించింది. రూ. 94,937 కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చినట్లు పేర్కొంది. చెల్లించాల్సిన తేదీ దాటిన 90 రోజుల తర్వాత కూడా కనీస మొత్తం జమ చేయని ఖాతాలను తాత్కాలిక నిరర్ధక రుణ (ఓవర్ డ్యూస్) ఖాతాలుగా బ్యాంకులు గుర్తిస్తాయి.
రుణమాఫీలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం చెల్లించినా తీసుకోవడానికి బ్యాంకులు సిద్ధం గా ఉన్నాయని ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ సి.దొరస్వామి చెప్పారు. మంగళవారం ఎస్‌ఎల్‌బీసీ సమావేశానంతరం ఆయన విలేకరులతో ము చ్చటించారు. ‘కిసాన్ వికాస పత్రాలను బ్యాం కులు అంగీకరిస్తాయి. రుణమాఫీ పథకం కింద ప్రభుత్వం జారీ చేసే బాండ్లు ఎలా ఉంటాయి? దానికి ఉన్న సాధికారత ఏమిటి? ఆర్బీఐ వాటిని అంగీకరిస్తే.. బ్యాంకులూ అం గీకరిస్తాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎవరు చెల్లించినా, ఏ రూపంలో చెల్లించినా బ్యాంకులు తీసుకుంటాయి’ అని చెప్పారు. తొలుత 20 శాతం చెల్లిస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన గురించి ప్రస్తావించగా.. ‘మీకు ఎవరైనా రూ.100 బాకీ ఉంటే.. రూ. 20 ఇస్తానంటే వద్దంటారా? ఇచ్చినంత తీసుకొని మిగతా మొత్తం ఇవ్వమని అడుగుతారు. బ్యాంకులు కూడా అంతే’ అని స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం ఇచ్చినా, 30 శాతం ఇచ్చినా తీసుకుంటామని, మిగతా సొమ్మునూ ఇవ్వమని అడుగతామని అన్నారు. 20 శాతం నిధులు చెల్లించిన తర్వాత రైతులకు రుణాలు ఇచ్చే విషయమై ఆర్బీఐ నిబంధనల మేరకే బ్యాంకులు వ్యవహరిస్తాయని చెప్పారు.