పీసీ ప్యాపిలి వద్ద విద్యార్థులతో వస్తున్న ట్రాక్టరును ఆపి ఎంఈఓ, ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ ఇస్తున్న సీఐ
ఈ చిత్రంలో చేతులు కట్టుకుని నిల్చున్న పిల్లాడి వయస్సు 14. వచ్చీరాని డ్రైవింగ్‌తో 70 మంది విద్యార్థులను ట్రాక్టర్‌లో వజ్రకరూరు సమీపంలోని వజ్రాల అన్వేషణ క్యాంప్ పరిశీలనకు తీసుకెళ్తున్నాడు. ఇతడిని ఆ పనికి పురమాయించింది ఎవరో కాదు.. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు. అందరికీ మంచీచెడు బోధించే వీరు.. విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రయాణానికి పురమాయించారు. మంగళవారం ఉదయం వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి ప్రభుత్వ పాఠశాలలో 4, 5, 6వ తరగతి విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి ఎర్రిస్వామి, మరో ముగ్గురు ఉపాధ్యాయులు 12 కిలోమీటర్ల దూరంలోని వజ్రాల అన్వేషణ క్యాంప్ పరిశీలనకు ట్రాక్టర్‌లో తీసుకెళ్లారు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న సీఐ చిన్నగౌస్ వాహనాన్ని అడ్డుకున్నారు. డ్రైవింగ్ చేస్తున్న పిల్లాడిని లైసెన్స్ అడుగగా.. ఇంకా నేర్చుకుంటున్నట్లు సమాధానమిచ్చాడు. దీంతో ఎంఈఓతో పాటు ఇతర ఉపాధ్యాయులకు చివాట్లు పెట్టారు. పిల్లలకు ఏదయినా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా అంటూ ప్రశ్నించారు. అనంతరం ట్రాక్టర్‌ను సీజ్ చేసి.. విద్యార్థులను ఇతర వాహనాల్లో సురక్షితంగా తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment