అయినవిల్లి సిద్ధివినాయకుని ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిసాయి. స్వామివారి ఉత్సవ పందిరిలో ఏర్పాటుచేసిన మట్టి గణపతి ప్రతిమను రాత్రి సమీపంలోని పంటకాలువలో నిమజ్జనం చేశారు.
అయినవిల్లి,న్యూస్‌లైన్ :
అయినవిల్లి సిద్ధివినాయకుని ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిసాయి. స్వామివారి ఉత్సవ పందిరిలో ఏర్పాటుచేసిన మట్టి గణపతి ప్రతిమను రాత్రి సమీపంలోని పంటకాలువలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా పూజాటికెట్లు , ప్రసాద విక్రయాలు, అన్నదానపథకానికి విరాళాల రూపేణా స్వామివారికి రూ.15 లక్షల 87వేల 325 అదాయం లభించినట్టు ఆలయ ఈఓ మూదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. రాజమండ్రికి చెందిన మలబార్ గోల్డ్ సంస్ధ యాజమాన్యం స్వామివారి ఆలయంలో ఉచిత ప్రసాద వితరణ నిర్వహించారు. నవరాత్రులలో అయినవిల్లి వచ్చే భక్తుల సంఖ్య సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో గణనీయంగా తగ్గింది. ఏటా నవరాత్రులలో స్వామివారిని సుమారు లక్ష ఏభైవేల మంది భక్తులు దర్శించేవారని, ఈసారి 70వేల మంది మాత్రమే వచ్చారని ఆలయ అధికారులు పేర్కోన్నారు.
వినాయకునికి పుష్పాలంకరణ
నవరాత్రుల ముగింపు సందర్భంగా మంగళవారం అయినవిల్లి సిద్ధి వినాయకుడ్ని ప్రత్యేకంగా అలంకరించారు. నెమలి పింఛాలు, వివిధ పుష్పాలతో స్వామిని అద్వితీయంగా అలంకరించడంతో భక్తులు పరవశించారు. ఆలయ అర్చకులు మాచరి వినాయకరావు, రాజేశ్వరరావు ఈ అలంకరణ నిర్వహించారు.