సోమేశ్వరం (రాయవరం), న్యూస్‌లైన్ : జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా రూ.15 వేల కోట్ల రుణాలను ప్రాధాన్య రంగాలకు అందజేసినట్టు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) ఏజీఎం కేఎస్‌ఎస్ సోమయాజులు వెల్లడించారు. శుక్రవారం ఆయన మండలంలోని సోమేశ్వరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని సందర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సహకార సంఘాలను బహుళార్థ ప్రయోజక సహకార కేంద్రాలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. ఎటువంటి ఆర్థిక లోటుపాట్లు జరగకుండా, సక్రమంగా ఆడిట్ జరిగిన సంఘాలకు మాత్రమే ఇటువంటి సౌకర్యం కల్పిస్తామని వివరించారు.
సహకార సంఘాల ద్వారా రైతులకు నాబార్డు 55 శాతం, ఆప్కాబ్ 15 శాతం, స్థానిక సహకార సంఘాలు 30 శాతం కలిపి రుణాలను అందజేస్తున్నట్టు చెప్పారు. రైతులు గొడౌన్లు, కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మించుకునేందుకు, బంగారు ఆభరణాల మీద రుణాలు తీసుకునేందుకు సహకార సంఘాల ద్వారా అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా రూ.11 వేల కోట్ల డిపాజిట్లు సేకరించగా, రూ.15 వేల కోట్లు రుణాలుగా అందజేశారన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులతో సహకార సంఘాలు, బ్యాంకుల ద్వారా ఖరీఫ్‌కు రూ.26,500, రబీకి రూ.30 వేల చొప్పున రైతులకు రుణాలను అందజేస్తున్నామన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో నాబార్డులో రూ.8,050 కోట్లు ప్రాధాన్య రంగాలకు రుణాలుగా అందజేసేందుకు నిర్ణయించామన్నారు. ఈ రుణాలను స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రుణాలుగా అందజేస్తామన్నారు.
పంట రుణాలకు రూ.మూడు లక్షల వరకు ప్రాసిసెంగ్ చార్జీలు తీసుకోవడం లేదన్నారు. 2014-15 ఆర్థిక సంవ త్సరంలో రూ.9,200 కోట్లు రుణాలుగా ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వివరించారు. మొత్తం రుణాల్లో 79 శాతం వాణిజ్య బ్యాంకులు ఇస్తుంటే, సహకార సంఘాలు, డీసీసీబీ కలిపి 17 శాతం, గ్రామీణ బ్యాంకులు నాలుగు శాతం రైతులకు రుణాలుగా ఇస్తున్నట్టు తెలిపారు. రైతులకు లాభదాయకంగా ఉండేందుకు గోల్డ్‌లోన్లు, ఎరువులు ఒకేచోట ఇచ్చేందుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. మీ-సేవ కేంద్రాలను సహకార సంఘాల ద్వారా నిర్వహించే ఆలోచన ఉన్నట్టు వెల్లడించారు.
బక్షి కమిటీ తీర్మానాలు సలహాలు మాత్రమే..
సహకార సంఘాలపై ప్రకాష్ బక్షి కమిటీ చేసిన తీర్మానాలు కేవలం సలహాలు మాత్రమేనని సోమయాజులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ 29 రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని సిఫారసులు చేసిందన్నారు. వీటిని మన రాష్ట్రంలో అమలు చేయాలా లేక తిరస్కరించాలా అనే అంశం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు.
బ్యాంకుల ద్వారా రూ.15 వేల కోట్ల రుణాలు
Published Sat, Sep 14 2013 4:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement