రెండు నెలలు.. 15 దొంగతనాలు
దొంగతనాలకు అడ్డాగా మారిన సూర్యాపేట..
పెద్ద ఎత్తున నగదు, బంగారు ఆభరణాల అపహరణ
భయబ్రాంతులకు గురువుతున్న ప్రజలు
టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు కలేనా
సూర్యాపేట..దొంగలకు అడ్డాగా మారింది. తరచూ దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. రెండు నెలల్లో సుమారు 3కిలోల బంగారు, కిలో వెండి ఆభరణాలతో పాటు రూ.6లక్షల నగదు అపహరణకు గురైంది. సూర్యాపేట హైదరాబాద్-విజయవాడ నగరాల మధ్య ఉండడం, వరంగల్, జనగాం, మిర్యాలగూడ పట్టణాలకు ప్రధాన కూడలిగా ఉంది. దీంతో దొంగతనాలకు పాల్పడి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న పట్టణం దొంగతనాల విషయంలో అదే రీతిలో ఉండడంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది.
సిబ్బంది కొరత...
సూర్యాపేటలో పోలీసు సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. సుమారు లక్ష పైచిలుకు జనాభా, అదే విధంగా రోజు వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చివెళ్లే వారు సుమారు 50 వేల మంది ఉంటారు. దీంతో పట్టణంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. పట్టణంలో ఒకటే పోలీస్‌స్టేషన్ ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంది. ఉన్న సిబ్బందిలో కొంతమంది వివిధ బందోబస్తులకు వెళ్తుంటారు. మిగిలిన వారితో పెట్రోలింగ్ చేయడం ఇబ్బందిగా మారింది. సూర్యాపేట గ్రేడ్-1 మున్సిపాలిటీ. దీంతో పోలీస్తే మిర్యాలగూడ పట్టణంలో రెండు పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసి సరిపడా సిబ్బందిని నియమించారు. కానీ సూర్యాపేటలో మాత్రం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడం లేదు. గతంలో హోంమంత్రిగా పనిచేసిన రాష్ట్ర మంత్రి జానారెడ్డి పేటలో టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనే కాక ఎంతో మంది ప్రజాప్రతినిధులు హామిలిచ్చినా అవి నేటికీ నెరవేరలేదు.
రెండు నెలల్లో పేటలో జరిగిన చోరీల్లో ముఖ్యమైనవి..
నవంబర్‌లో 23వ తేదీ రాత్రి హైటెక్ బస్టాం డ్‌లో నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సులోనుంచి బంగారు దుకాణం గుమాస్తాల వద్ద ఉన్న సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల నగదు అపహరించారు.
29వ తేదీన శ్రీశ్రీనగర్‌లోని పగిళ్ల సతీష్ నివాసంలో తాళం పగలగొట్టి పట్టపగలు 6తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు, ఖమ్మం క్రాస్ రోడ్‌లోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు నివాసంలో పట్టపగలు తాళం పగలగొట్టి 4తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
డిసెంబర్‌లో 15వ తేదీన ఉదయం వేళలో ఇంటికి తాళం వేసిన మూడు ఇళ్లలో, జమ్మిగడ్డలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఒకేసారి చోరీలకు పాల్పడ్డారు. కాసం నర్సింహారెడ్డి నివాసంలో 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు, తోట శంకర్ ఇంట్లో కిలో వెండి ఆభరణాలు, మూడు తులాల బంగారు ఆభరణాలు, వాసు నివాసంలో రెండు తులాల బంగారు ఆభరణాలను అపహరించారు.
జనవరిలో 6వ తేదీన శ్రీశ్రీనగర్‌లోని ప్రభుత్వ ఉపాధ్యాయుల నివాసంలో సుమారు 15తులాల బంగారు ఆభరణాలు, రూ.66 నగదును చోరీ చేశారు. ఇలాంటి సంఘటనలు పట్టణంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి.
అమలుకు నోచుకోని ఎస్పీ హామీ..
ఇటీవల జిల్లాలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండడంతో వాటిని అరికట్టేందుకు జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు ప్రణాళిక రూపొందించారు. దొంగతనాలు జరిగినపుడు జరుగుతున్న నష్టాన్ని తగ్గించేందుకు ప్రజల వద్ద ఉండే విలువైన బంగారు, వెండి ఆభరణాలను జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఉన్న పోలీస్‌స్టేష న్‌లో భద్రపరిచేందుకు లాకర్ల సౌకర్యం కల్పిస్తామని ఇటీవల హామీ ఇచ్చారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే పోలీస్‌స్టేషన్‌లో లాకర్‌లను ఏర్పాటు చేస్తే ప్రజలు ఏదైనా పని నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిన పుడు విలువైన వస్తువులను స్టేషన్లలో భద్రపరుచుకునే అవకాశం ఉంది. కానీ ఎస్పీ హామీ అమలుకు నోచుకోవడం లేదు.
సీసీ కెమెరాలెక్కడా..
ఏదైనా సంఘటనలు జరిగినపుడు మాత్రం కొన్ని రోజులపాటు అధికారులు ఎక్కువగా హడావుడి చేస్తారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అది చేస్తాం..ఇది చేస్తాం అని మాటలు చెబుతారు. ఆ తర్వాత షరామామూలే. పట్టణంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండడంతో పోలీస్ అధికారులు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రోజులు గడుస్తున్నాయి..దొంగతనాలు జరుగుతూనే ఉన్నా సీసీకెమెరాలు మాత్రం ఏర్పాటు కావడం లేదు.
ప్రజల్లో మార్పు రావడం లేదు
దొంగతనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎన్నో రకాలుగా అవగాహన కల్పించినప్పటికీ ప్రజల్లో మార్పు రావడం లేదు. వివిధ ప్రాంతాలకు వెళ్లే సమయాల్లో పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపాం. విలువైన వస్తువులు బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించాం. ఆ విధంగా ఎవరూ చేయడం లేదు. దొంగతనాలను అరికట్టేందుకు తమ వంతుగా చర్యలు చేపడుతున్నాం. జరిగిన చోరీలను ఛేదించేందుకు పాత నేరస్తుల వివరాలు సేకరిస్తున్నాం. త్వరలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లలో సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తాం.
- ఎస్. శ్రీనివాసులు, సూర్యాపేట ఇన్‌స్పెక్టర్
రెండు నెలల్లో 15 దొంగతనాలు..పలు చైన్‌స్నాచింగ్‌లు.. ఇదీ..సూర్యాపేటలో దొంగల హల్‌చల్. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట దొంగతనాలకు అడ్డాగా మారింది. రాత్రి, పగలు తేడా లేకుండా దొంగత నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు వివిధ రకాలుగా ప్రజలకు అవగాహన కల్పించినా ఫలితం లేకుండా పోతోంది.
-న్యూస్‌లైన్, భానుపురి