
ఆప్‌గ్రేడ్ చేసి ఆరేళ్లయినా రెగ్యులర్ హెచ్‌ఎం లేని పెండ్యాల జెడ్పీ ఉన్నత పాఠశాల
పశ్చిమగోదావరి, నిడదవోలురూరల్ : విద్యా ప్రమాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా జిల్లాలో ఉన్నత విద్యకు గ్రహణం పడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు దిగజారుతున్నాయి. సరైన ప్రణాళిక లేకపోవడంతో ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీల నేపథ్యంలో సుమారు రెండు నెలలపాటు పాఠశాలల్లో సక్రమంగా బోధన జరగలేదు. టీచర్లంతా బదిలీలపైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో విద్యార్థులకు నష్టం వాటిల్లింది. చివరకు ఎన్నో అవాంతరాల మధ్య ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ కొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులను నియమించకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. జిల్లాలో 356 జెడ్పీ, 16 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 19 పాఠశాలలకు రెగ్యులర్ హెచ్‌ఎంలు లేరు. మరో 21 పాఠశాలకు ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులను నియమిస్తూ ఆర్జేడీ ఉత్తర్వులు ఇచ్చినా అవి ఇంకా అమలు కాలేదు. కొత్త డీఎస్సీలో సుమారు 240 స్కూలు అసిస్టెంట్ నియమకాలు చేపట్టాల్సి ఉంది. ఈ పరిణామాలు ఆయా పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి.
సీనియర్ ఉపాధ్యాయులే బాస్‌లు
ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. పది ఫలితాల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలంటే అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు సక్రమంగా ఉండాలి. కానీ కొన్ని పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ రెగ్యులర్ సబ్జెక్టుల సీనియర్ టీచర్లను పాఠశాలకు ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులుగా నియమించడంతో పూర్తిస్థాయిలో బోధన సాగడం లేదు. దీంతో ఉపాధ్యాయులు జోడు పదవులపై స్వారీ చేస్తూ దేనికీ సరైన న్యాయం చేయలేని పరిస్థితి నెలకొంది.
కొరవడిన పర్యవేక్షణ
ఉపాధ్యాయుల పనితీరు, బోధనను పర్యవేక్షిస్తూ వారికి వేతనాల చెల్లింపులు, సెలవుల మంజూరు, మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు, కాంప్లెక్స్ సమావేశాలు, ప్రభుత్వ విద్యా కార్యక్రమాల అమలు.. తదితర అంశాలపై ప్రధానోపాధ్యాయులు దృష్టి పెట్టాల్సి ఉంది. రెగ్యులర్ హెచ్‌ఎంలు లేకపోవడంతో ప్రతి నెలా సుమారు 450 మంది ఉపాధ్యాయులు వేతనాల కోసం ఇబ్బంది పడాల్సి వస్తోంది. గత విద్యా సంవత్సరంలో కూడా ఈ సమస్య వేధించడంతో పది ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 12వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిడదవోలు మండలం సమిశ్రగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలకు రెగ్యూలర్ హెచ్‌ఎం లేకపోవడంతో పది పరీక్షలకు 97 మంది విద్యార్థులు హాజరు కాగా 17 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.
ఆప్‌గ్రేడ్ పాఠశాలల్లోనూ సమస్యలు
జిల్లాలోని 13 ప్రాథమికోన్నత పాఠశాలలను దశలవారీగా ఉన్నత పాఠశాలలుగా ఆప్‌గ్రేడ్ చేశారు. అయితే ఈ పాఠశాలల్లో కార్యాలయ సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడంతో టీసీలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా సాగడం లేదు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ పనితీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదనపు బాధ్యతలతో అవస్థలు
పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అదనంగా హెచ్‌ఎం బాధ్యతలు అప్పగించడంతో పాలనాపరంగా అవస్థలు తప్పడం లేదు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్యాంశాలు బోధించలేని దుస్థితి నెలకొంది. సీనియర్ ఉపాధ్యాయులు పాఠశాల నిర్వహణపై దృష్టి పెట్టడంతో విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నారు. పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించాలంటే హెచ్‌ఎం ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి. –పి.జయకర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, నిడదవోలు