చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో పిడుగుపడి ఇద్దరు మృతిచెందారు.
హైదరాబాద్: చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో పిడుగుపడి ఇద్దరు మృతిచెందారు. వైఎస్సార్ జిల్లా రాజుపాళెం మండలం చెన్నశెట్టిపల్లెలో శుక్రవారం పిడుగుపాటుతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ముక్కమల్ల రామ్మోహన్‌రెడ్డి(38) అనే రైతు చింతలబాబు పొలంలో అతనితో కలిసి మందు చల్లుతుండగా సమీపంలో పిడుగు పడింది. దీంతో రామ్మోహన్‌రెడ్డి అక్కడికక్కడే మరణించగా, చింతలబాబు చేయి చచ్చుబడిపోయింది.
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలోని సీకాయపట్టెడ గ్రామానికి చెందిన కృష్ణమూర్తి(33) శుక్రవారం పిడుగుపాటుతో మృతి చెందాడు. ఇతను శుక్రవారం మధ్యాహ్నం పశువులను మేతకోసం సమీపంలోని పొలాల వద్దకు తోలుకెళ్లాడు. సాయంత్రం భార్యవచ్చి నేను ఉంటాను, ఇంటికి వెళ్లమని చెప్పింది. దాంతో ఇంటికి వెళుతుండగా పక్కనే పిడుగుపడి శరీరం పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.