'కేశినేని' బస్సు బోల్తా:20 మందికి తీవ్రగాయాలు | 20 injured in bus accident | Sakshi
Sakshi News home page

'కేశినేని' బస్సు బోల్తా:20 మందికి తీవ్రగాయాలు

Published Tue, May 19 2015 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

20 injured in bus accident

గుత్తి/గుత్తి రూరల్ : ఓల్వో బస్సు రోడ్డు పక్కన గుంతలో బోల్తా పడింది. సుమారు 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడిన ఘటన గుత్తి సమీపంలోని కొత్తపేట శివారులో సోమవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకెళితే... విజయవాడకు చెందిన కేశినేని ట్రావెల్స్ ఓల్వో బస్సు ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు  బయలుదేరింది. 44వ జాతీయ రహదారిపై తెల్లవారుజామున గుత్తి సమీపంలోని కొత్తపేట-ఎస్కేడీ ఇంజినీరింగ్ కాలేజీ మధ్య ప్రమాదవశాత్తు బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 15 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగినపుడు బస్సులో మొత్తం 47 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు పల్టీలు కొట్టడంతో బస్సులో ఉన్న హైదరాబాద్‌కు చెందిన రవిచంద్ర, శ్రీనివాసులు, మంజులు, సుమంత్ రెడ్డి, ఉషారాణి, షాజిర్, హర్షలత, ఆదిత్య, రాజేష్,ప్రియాంక, కళ్యాణి, ఎం.కళ్యాణి, సౌమ్య, బ్రహ్మణి, జాన్, ధనిబాబు, శ్రావణ్‌కుమార్, అరవింద్,ప్రవీణ్, శివ శంకర్, రామాంజినేయులు, చంద్రశేఖర్, ఘనిబాబు, మల్లయ్య, ముస్తఫా, రామ్‌రాజు(బస్సు రెండవ డ్రైవర్)తో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదాన్ని హైవే పెట్రోలింగ్ టీమ్ గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సీఐ మధుసూదన్ గౌడ్, ఎస్‌ఐ రామాంజనేయులు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనంలో గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సౌమ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ కేశవ్ ప్రమాదం జరిగిన వెంటనే పరారైయ్యాడు.
 
ప్రయాణికుల భద్రత గాలికి
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యజమానులు ప్రయాణికుల భద్రత గాలికి వదిలేస్తున్నారు. పోటీ అధికం కావడంతో ప్రయాణికులకు త్వరగా గమ్యస్థానాలకు చేర్చాలని అధిక వేగంతో బస్సులు నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలపైకి తెస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్‌లో బయలుదేరే బస్సులు తెల్లారేసరికి బెంగళూరుకు చేరుకోవాలని 140 కిలోమీటర్ల స్పీడుతో బస్సులను నడుపుతూ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఇటీవల ఇదే తరహాలోనే గుత్తి శివారులోని టోల్‌ప్లాజా వద్ద బస్సు బోల్తా పడి చిత్తూరుకు చెందిన నవవధువు మృతి చెందింది. అయినా అధికారులు ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు.
 
డ్రైవర్ కునుకుతోనే..
డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. రెండు కిలో మీటర్లు వెళ్లి ఉంటే (టోల్‌ప్లాజా వద్ద) రెండో డ్రైవర్ రామ్‌రాజు బస్సు నడపాల్సి ఉంది. ఇంతలోనే బస్సు ప్రమాదానికి గురి అయింది. ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులందరూ తమ ఊర్లకు వెళ్లిపోయారు.
 
ఎంవీఐ ఉదారత
ఓల్వో బస్సు గుత్తి వద్ద ప్రమాదానికి గురైందనే విషయం తెలుసుకున్న గుంతకల్లు ఎంవీఐ(మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్) శివారెడ్డి వెంటనే స్పందించి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు వాహనాలను సమకూర్చారు. స్వల్పంగా గాయపడిన వారిని వారి సొంత ఊర్లకు, గమ్యస్థానాలకు వాహనాల్లో తరలించారు. క్షతగాత్రులను అనంతపురం, కర్నూలు తరలించేందుకు కృషి చేశారు.
 
పెరిగిన ఓల్వో ప్రమాదాలు

* ఓల్వో బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. గతంలో ప్రమాదాలు అధికం కావడంతో రోడ్డు రవాణా శాఖ అధికారులు ఓల్వో బస్సులను బ్యాన్ చేయాలని కూడా నిర్ణయించారు.
 
* ఓల్వో బస్సులో ఏదో టెక్నికల్ సమస్య ఉన్నట్లు అప్పట్లో రవాణాశాఖ అధికారులు తేల్చారు. ఇంతలో ప్రభుత్వం మారింది. దీంతో బ్యాన్ విషయం పక్కకు పోయింది. ఓల్వో బస్సుల్లో అధికంగా టీడీపీ నేతలకు చెందినవి కావడంతో వాటి ని బ్యాన్ చేయడానికి రవాణా శాఖ అధికారులు సంకోచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement