శ్రామిక రైలులో భౌతిక దూరం పాటిస్తూ కూర్చున్న వలస కూలీలు
సాక్షి, విజయవాడ/ మంగళగిరి/ తాడేపల్లిరూరల్: వలస కూలీలకు భోజనం, వసతి, వారి తరలింపునకు ప్రత్యేక శ్రామిక రైళ్ల ఏర్పాటు తదితర ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటి వరకు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో 17 ప్రత్యేక శ్రామిక రైళ్ల ద్వారా దాదాపు 20 వేల మంది వలస కూలీలను స్వరాష్ట్రాలకు చేర్చింది. డివిజన్ పరిధిలో ఈ నెల ఐదో తేదీ నుంచి దాదాపుగా ప్రతి రోజూ ఒక ప్రత్యేక శ్రామిక రైలును నడుపుతున్నారు. ఇందుకయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. మానవతా దృక్పథంతో వలస కూలీలకు భోజనం, వసతితో పాటు అన్ని సదుపాయాలూ కల్పించి వారిని స్వస్థలాలకు పంపాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకనుగుణంగా అధికారులు పనిచేస్తున్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్, అసోం, మణిపూర్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను విజయవాడలోని రాయనపాడుతో పాటు నెల్లూరు, నిడదవోలు, కొవ్వూరు, ఒంగోలు రైల్వేస్టేషన్ల నుంచి రైళ్ల ద్వారా గమ్యస్థానాలకు చేర్చుతోంది.
స్వస్థలాలకు భవన నిర్మాణ కార్మికులు
మంగళగిరిలోని ఎయిమ్స్‌తో పాటు కాజ, చినకాకాని, తాడేపల్లి జాతీయ రహదారి వెంట పలు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్, బిహార్, ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా్లలకు చెందిన 2,400 మంది కార్మికులను సోమవారం శ్రామిక రైలుతో పాటు ఆర్టీసీ బస్సుల్లో అధికారులు వారి స్వస్థలాలకు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment