లక్ష రూపాయల కంపెనీకి 200 ఎకరాలు | 200 acres per one lakh rupees company | Sakshi
Sakshi News home page

లక్ష రూపాయల కంపెనీకి 200 ఎకరాలు

Published Sun, Feb 17 2019 5:30 AM | Last Updated on Sun, Feb 17 2019 10:25 AM

200 acres per one lakh rupees company - Sakshi

సాక్షి, అమరావతి: ఎటువంటి అనుభవం లేకపోయినా కేవలం కాగితంపై ఏర్పాటైన ఒక కంపెనీకి రూ.వందల కోట్ల విలువైన భూమిని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేటాయిస్తుందా? కేవలం రూ.లక్ష మూలధనంతో ఒక కంపెనీని నమోదు చేసుకొని వందల కోట్ల పెట్టుబడితో వేలల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఒప్పందం కుదుర్చుకుంటే చాలు.. ముందూవెనుక ఆలోచించకుండా రూ.కోట్ల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా ఇచ్చేస్తోంది. అక్టోబర్‌లో కాగితాలపై ఏర్పాటైన కంపెనీ నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటే ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉన్న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదిం చడం, ఆ తర్వాత మూడు రోజులకే జీవో విడుదల కావడం వెనువెంటనే జరిగిపోయాయి. ఎన్నికల వేళ మేజెస్‌ ఎలక్ట్రానిక్‌ పార్కుకు ప్రభుత్వం కారుచౌకగా కేటాయించిన భూముల వ్యవహారం ఉన్నతా ధికారుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రూ.40 కోట్లకే 200 ఎకరాలు
తిరుపతికి అత్యంత సమీపంలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో మెడికల్‌ డివైస్‌ పార్కును ఏర్పాటు చేయడానికి మేజెస్‌ ఎలక్ట్రానిక్‌ పార్కుకు 200 ఎకరాలు కేటా యిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తిరుపతి–శ్రీకాళహస్తి మార్గంలో ప్రస్తుతం ఎకరం రూ.కోటిన్నర పలుకుతున్న భూమిని ఎకరం కేవలం రూ.20 లక్షలకే కేటాయించింది. బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం.. రూ.300 కోట్లు పలుకుతున్న 200 ఎకరాల భూములను కేవలం రూ.40 కోట్లకే అప్పగించేసింది. అంతేకాకుండా 2014–20 పారిశ్రామిక పాలసీలో లభించే రాయితీలకు అదనంగా మరో రూ.50 కోట్లు ప్రాజెక్టు వ్యయంలో సబ్సిడీగా ఇస్తూ నిర్ణయం తీసుకుంది. 

చకచకా కదిలిన ఫైలు
కేవలం లక్ష రూపాయల మూలధనంతో గతేడాది అక్టోబర్‌ 24న మొగిలి ఇందు మౌళి (మేనేజింగ్‌ డైరెక్టర్‌), బండారు నరసింహారావు, అరగొండ రోహిత్‌ రెడ్డిలు డైరెక్టర్లుగా మేజెస్‌ ఎలక్ట్రానిక్‌ పార్క్‌ లిమిటెడ్‌ ఏర్పాటైంది. తిరుపతి సమీపంలో రూ.188 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్‌ పార్కును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం నవంబర్‌ 28న మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక అక్కడ నుంచి ఫైలు అత్యంత వేగంగా కదిలింది. ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం కావడం, 2014–20 పారిశ్రామిక పాలసీకి అదనంగా సబ్సిడీ ధరకే భూమి కేటాయించడం, పెట్టుబడి వ్యయంలో 30 శాతం సబ్సిడీగా ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. ఇది జరిగిన మూడు రోజుల్లోనే దీనికి సంబంధించిన జీవోను పరిశ్రమల శాఖ విడుదల చేయడం గమనార్హం.

ఎలాంటి అనుభవం లేకున్నా.. 
పేరుకు మేజెస్‌ ఎలక్ట్రానిక్‌ పార్క్‌ అని కనిపిస్తున్నా దీని వెనుక దుబాయ్‌కు చెందిన కంపెనీ కీలకపాత్ర పోషించింది. ప్లాస్టిక్‌ చెత్త కవర్లు, చెత్తబుట్టలు తయారుచేసే దుబాయ్‌కు చెందిన అల్‌ బకరా ప్లాస్టిక్‌ ఇండస్ట్రీస్‌ ఎల్‌ఎల్‌సీ; ముఖానికి, తలకి తగిలించుకునే మాస్క్‌లు తయారు చేసే మెడిక్యూబ్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, శ్రీ సిదార్థ ఇన్‌ఫ్రాటెక్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌లు కలిసి మేజెస్‌ను ఏర్పాటు చేశాయి. రూ.188 కోట్ల పెట్టుబడితో వైద్య పరికరాల పార్కును అభివృద్ధి చేస్తామని, ఈ పార్క్‌ ద్వారా 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ ఈ మూడు సంస్థలకు వైద్య పరికరాల తయారీలో ఎటువంటి అనుభవం లేదు. కేవలం మెడికల్‌ పార్క్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవడానికి కారుచౌకగా ప్రభుత్వం భూమిని కేటాయించినట్లు కనిపిస్తోందని ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇలా ఒక అనామక కంపెనీకి రూ.310 కోట్ల ప్రయోజనాలు కల్పించే విధంగా ప్రభుత్వ పెద్దలు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకోవడంపై అధికార వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement