
‘ఏపీలో సీఎంను నిర్ణయించేది మనమే’
‘ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉండాలి?
– కేంద్రంలో మళ్లీ అధికారం మనదే
– ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ కూడా మనదే..
– భారతీయ జనతా పార్టీ నేతలు
కదిరి: ‘ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉండాలి?.. ఎవరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలి అని నిర్ణయించేది మనమే.. బీజేపీ ఓట్లే 2019 ఎన్నికల్లో కీలకం కానున్నాయి’ అని బీజేపీ జాతీయ సహప్రధాన కార్యదర్శి సంతోష్, యువమోర్చ రాష్ట్ర అద్యక్షులు విష్ణువర్దన్‌రెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సరస్వతి విద్యామందిరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ కదిరి నియోజకవర్గ పోలింగ్‌బూత్ కార్యకర్తల సమ్మేళన సభలో వారు ప్రసంగించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడీ సర్కారు ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని వారు గుర్తు చేశారు. అయితే వాటన్నింటినీ రాష్ట్రసర్కారు తమ పథకాలుగా చెప్పుకోవడం దురదృష్టకరమన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఏపీలోని ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తున్నారని, రైతులు ఇప్పుడు అందుకుంటున్న ఇన్‌పుట్ సబ్సిడీ కూడా కేంద్రం ఇచ్చిందేనని వారు గర్వంగా చెప్పారు. మోడీ సర్కారు పేదల ప్రభుత్వమని వారు చెప్పుకొచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు 100 నుండి 150 రోజుల పనిదినాలుగా పెంచిన ఘనత కూడా కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందని తెలియజేశారు. దేశంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ..అని అభివర్ణించారు. గతంలో అధికారంలో ఉన్న యూపీఏ సర్కారు ఎన్నో అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు. కానీ నరేంద్రమోడీ మచ్చలేని పాలనను అందిస్తున్నారని ఈ విషయం ప్రతి బీజేపీ కార్యకర్త గర్వంగా చెప్పవచ్చన్నారు.