
15–09–2018, శనివారం
దువ్వపాలెం క్రాస్, విశాఖపట్నం జిల్లా
మనదేశ ఇంజనీర్లు కొరగారని ముఖ్యమంత్రే వ్యాఖ్యానించడం అవమానకరం
ఈ రోజు భారతరత్న, ప్రపంచం గర్వించదగ్గ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి జయంతి. ఆయనకు విశాఖతో గొప్ప అనుబంధం ఉంది. ఒకానొకప్పుడు పెను అలల తాకిడితో డాల్ఫిన్‌కొండ క్రమక్షయానికి గురవుతూ.. విశాఖ ఓడరేవుకు తీవ్రమైన ముప్పు పొంచి ఉండేది. అప్పటి పాలకులు పాశ్చాత్య దేశాలకు చెందిన ఎందరో ఇంజనీర్లతో సంప్రదింపులు జరిపారట. వారెవరి మేథకు అందని అద్భుత పరిష్కారాన్ని విశ్వేశ్వరయ్యగారు సూచించారు. ఓ నౌకను డాల్ఫిన్‌కొండ ఎదురుగా సముద్రంలో ముంచడం ద్వారా అలల తాకిడిని తగ్గించి.. విశాఖ ఓడరేవును కాపాడిన ఘనత విశ్వేశ్వరయ్యగారిది.
ఈ రోజు ఇంజనీర్స్ డే సందర్భంగా వందలాది మంది ఇంజనీర్లు ఏర్పాటుచేసిన సంఘీభావ కార్యక్రమంలో ఆ మహనీయునికి నివాళి అర్పించాను. ‘మోక్షగుండం’గారు వంటి ఎందరో మేధావుల్ని ప్రపంచానికి అందించిన గొప్పతనం మన దేశానిది. అంతటి ఘనమైన ప్రతిభా వారసత్వాన్ని కాదని.. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు విదేశీ గ్రాఫిక్స్ కంపెనీల చుట్టూ తిరగడం దేశ ప్రతిష్టను దిగజార్చడమే. దాని వెనుక స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయనడం ముమ్మాటికీ నిజమే. రాజధాని స్థాయి నిర్మాణాలకు మనదేశ ఇంజనీర్లు కొరగారని ముఖ్యమంత్రే వ్యాఖ్యానించడం అవమానకరం. మన పాలకులే మన ప్రతిభావంతుల్ని నిరాదరణకు గురిచేస్తూ చులకన చేస్తుంటే.. మేథో వలస జరగక ఏమవుతుంది?!
శ్రీకృష్ణాపురం దగ్గర నాగవయ్య అనే తాత కలిశాడు. వయసుతో పాటు వచ్చిన జబ్బులు అతన్ని వేధిస్తున్నాయి. బీపీ, షుగర్‌లతో సతమతమవుతున్నాడు. ‘ఇంతకుముందయితే ఊళ్లోకి 104 వచ్చేది. ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులూ ఇచ్చేది. ఇప్పడా జాడే లేదు.. మరి మా లాంటి పేదలు వేలకు వేలు పెట్టి మందులెలా కొనగలం?’అని ఆయన అడుగుతుంటే చాలా బాధేసింది.
మధ్యాహ్నం విశాఖ నగరం పూర్తయి భీమిలిలో అడుగుపెట్టాను. అల్లూరి సీతారామరాజు పుట్టిన పాండురంగి ఈ నియోజకవర్గంలోనే ఉంది. భీమిలి.. భీమునిపట్నం అని కూడా ప్రసిద్ధి. ఒకప్పుడు విశాఖతో పోటీపడుతూ సాగిన భీమిలి ప్రతిష్ట.. నేడు మసకబారింది. అలనాటి బకాసురుని తలపించే రీతిలో భూబకాసురులు తయారయ్యారిక్కడ.
అడవివరం గ్రామస్తులు ప్లకార్డులు పట్టుకుని వచ్చి కలిశారు. భూసమస్యను పరిష్కరించాలని కోరారు. సింహాచలం దేవస్థానానికి, పంచగ్రామాల ప్రజలకు మధ్య దశాబ్దాలుగా భూవివాదం రగులుతూనే ఉంది. వంద రోజుల్లో పరిష్కరిస్తానని కేబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చెప్పిన మాటలు.. నీటి మూటలే అయ్యాయి. ఇటువంటి సున్నితమైన సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నమే జరగకపోవడం బాధాకరం.
ఈ రోజు ఉదయం నుంచి బాగా ఉక్కపోత.. సాయంత్రం ఒక్కసారిగా కుండపోత. ఆ వర్షపు చినుకుల్లోనే విశాఖ న్యాయవాదులు కలిశారు. మొన్నటికి మొన్న జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికలప్పుడు బాబుగారు లాయర్లకు పలు వరాలు గుప్పించారు. ఆ ఎన్నికలు పూర్తవగానే వాటి గురించే పట్టించుకోవడం లేదట. సాధారణ ప్రజలను మోసగించినట్లుగానే మమ్మల్ని కూడా వంచించారంటూ ఆవేదన వ్యక్తం చేశారా న్యాయవాద సోదరులు.
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ మేనిఫెస్టోలోని 32వ పేజీలో న్యాయవాదులకు డెత్ బెనిఫిట్ రూ.6 లక్షలు, మెడికల్ బెనిఫిట్ రూ.2 లక్షలు, ఇళ్ల స్థలాలు, లోన్లు, గ్రూప్ ఇన్సూరెన్స్‌లు, నామినేటెడ్ పోస్టులు.. అంటూ 18 హామీలను గుప్పించారు. ఒక్కటైనా నెరవేర్చారా? ఎన్నికలప్పుడు చెప్పినట్టుగా డెత్ బెనిఫిట్‌ను రూ.6 లక్షలు కూడా చేయని మీరు.. బార్ కౌన్సిల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూ.8 లక్షలు చేస్తాననడం మరోసారి మోసం చేయడం కాదా?
-వైఎస్ జగన్