పుష్కర్‌ఘాట్ (కొవ్వూరు): గోదావరి పుష్కరాల ప్రారంభం సందర్భంగా రాజమండ్రి పుష్కర్‌ఘాట్‌లో 32 మంది మృత్యువాత పడిన ఘటన ప్రమాదం కాదని, ఆర్భాటపు ప్రభుత్వం చేసిన హత్యలే అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆరోపించారు. కొవ్వూరు వీఐపీ ఘాట్‌లో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. పుష్కర స్నానానికి వచ్చిన భక్తులు మృత్యువాత పడిన ఘటనపై చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలన్నారు. తాను నాలుగేళ్ల వయసు నుంచి పుష్కరాలు చూస్తున్నానని, ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ చోటు చేసుకోలేదన్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంగా సరైన ఏర్పాట్లు చేయలేదన్నారు. ఇది ఘోర తప్పిదమని, ప్రభుత్వ అసమర్థ వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హంగు, ఆర్భాటాలేకానీ ఏర్పాట్లపై సరిగా దృష్టి సారించలేదన్నారు. ఆయన ప్రత్యేక విమానంలో రావడం, తూతూ మంత్రంగా అధికారులతో మాట్లాడి వెళ్లిపోవడం తప్ప ప్రత్యక్షంగా ఘాట్‌లు పరిశీలించిన దాఖలాలు లేవన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుష్కర స్నానం చేసి వెళ్లేలా ఏర్పాట్లు చేశామంటూ చెప్పిన ప్రచారమంతా అవాస్తవమన్నారు. ఈ ఘటనపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని కొత్తపల్లి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు అసమర్థత వల్లే అమాయక ప్రజల ప్రాణాలు పోయాయని, వారి కుటుంబాలకు సరైన న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ తరుఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేయాలి : కారుమూరి
పుష్కర్‌ఘాట్ దుర్ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కారుమూరి వెంకటనాగేశ్వరరావు విమర్శించారు. తాను మూడు పుష్కరాలకు వచ్చి గోదావరిలో పుణ్యస్నానమాచరించానని, ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ చూడలేదన్నారు.
మంత్రులు బాధ్యత వహించాలి : వనిత
జిల్లాకు చెందిన మంత్రులతో పాటు పలువురు మంత్రులు పుష్కరఘాట్‌లు సందర్శించి ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేశామని ప్రచారం చేసుకోవడం తప్ప వాస్తవ పరిస్థితులపై దృష్టిసారించలేదని వైఎస్సార్‌సీపీ కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత అన్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. దీనికి పూర్తి బాధ్యత ఆ మంత్రులే వహించాలన్నారు.
ప్రభుత్వ వైఫల్యం : శ్రీలక్ష్మి
పుష్కరఘాట్ దుర్ఘటనకు ప్రభుత్వం వైఫల్యమే కారణమని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ప్రధానకార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి అన్నారు. అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆమె విచారం వ్యక్తంచేశారు.
చంద్రబాబు నిర్లక్ష్యమే కారణం
భీమవరం: రాజమండ్రి పుష్కరఘాట్లో తొక్కిసలాట ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబుదే బాధ్యతని వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పుష్కర ఏర్పాట్లను స్వయంగా చూస్తున్నానని పేర్కొన్న చంద్రబాబు ఈ దుర్ఘటనకు బాధ్యత వహించాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రచారానికే పరిమితమయ్యారేగానీ ఏర్పాట్లను సమీక్షించలేదన్నారు. వందల కోట్ల రూపాయలు వెచ్చించిన ఈ ప్రభుత్వం యాత్రికులకు మంచినీటి సదుపాయం కూడా కల్పించలేదన్నారు. గోదావరి పుష్కరాలను ప్రచార అస్త్రంగా మార్చుకున్న చంద్రబాబు సౌకర్యాలు కల్పించటంలో వైఫల్యం చెందటమే ఈ ఘోర సంఘటనకు కారణమన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మిగిలిన 11 రోజులు ఘాట్లలో అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కొవ్వొత్తులతో ప్రదర్శన
పాలకొల్లు సెంట్రల్: పుష్కరాలకు ప్రభుత్వం చేసిన ప్రచార ఆర్భాటాలకన్నామౌలిక వసతులు కల్పిస్తే ఇటువంటి ప్రమాదం జరిగేది కాదని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నా రు. మంగళవారం రాజమండ్రి పుష్కర ఘాట్లో తొక్కిసలాటలో మృతి చెందిన పుష్కర యాత్రికుల ఆత్మకు శాంతి చేకూరాలని స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ నుంచి కొవ్వొత్తులతో ఆయన ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. శేషుబాబు మాట్లాడుతూ వీఐపీ ఘాట్ ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు సరస్వతి ఘాట్లో సుమారు 3 గంటలు పూజలు నిర్వహించటంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ప్రచారం చేసుకున్నారుకానీ వసతులు కల్పించలేకపోయారన్నారు. మా ట్లాడితే చాలు నాకు చాలా అనుభవం ఉందని ఊదరగొట్టే అనుభవం ఇదేనా అని ప్రశ్నించారు. కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయడానికి శిబిరాలు లేవని, 108, 104ల సౌకర్యాలు కల్పించలేకపోయారని చెప్పారు. దీనికి చంద్రబాబు నైతిక బాద్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. నాయ కులు యడ్ల తాతాజి, చెల్లెం ఆనందప్రకాష్, గుణ్ణం సర్వారావు, డి.దుర్గమ్మ, ఎం.మైఖేల్‌రాజు పాల్గొన్నారు.
ప్రమాదం కాదు.. ప్రభుత్వ హత్యలే
Published Wed, Jul 15 2015 3:52 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement