గతంలో అధికారాన్ని వెలగబెట్టిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంతోని ప్రభుత్వం
సీపీఐ నేతల ధ్వజం
జైల్ భరో కార్యక్రమంలో 270మంది సీపీఐ కార్యకర్తల అరెస్ట్
విజయనగరం క్రైం: గతంలో అధికారాన్ని వెలగబెట్టిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంతోని ప్రభుత్వం బ్రిటిష్ కాలంనాటి 1894 భూ సేకరణ చట్టాన్ని అడ్డుపెట్టుకుని రైతుల నోటిలో మట్టికొడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జల్లి విల్సన్ మండిపడ్డారు. ప్రజావసరాల పేరిట లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకున్నాయని విమర్శించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రైతుల పాలిట యమకింకరుడిలా మారిందని ఆరోపించారు. గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగిన జైల్ భరో కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. జైల్ భరో కార్యక్రమానికి సీపీఐ కార్యకర్తలు ఉదయం తొమ్మిది గంటలకే కలెక్టరేట్‌లోని రెండు ప్రధాన గేట్లను మూసి అడ్డంగా కూర్చుని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జల్లి విల్సన్ మాట్లాడుతూ ప్రధానమంత్రిగా మోడీ అధికారం చేపట్టిన వెంటనే భూసేకరణ 2013 చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారన్నారు. యూపీఏ ప్రభుత్వం చేసిన చట్టంలో 3 పంటలు పండే భూమిని తీసుకోరాదని, ప్రభుత్వం సేకరించే భూమికి ప్రభావిత ప్రాంతంలో 70శాతం, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకైతే 80శాతం ప్రజలు అంగీకరించాలని, గిరిజన ప్రాంతంలో గ్రామ సభలు అంగీకరించాలన్న నిబంధనలున్నాయన్నారు. కాని నేడు ఎన్‌డీఏ ప్రభుత్వం భూ సేకరణ 2015 పేరిట తెచ్చిన ఆర్డినెన్స్..నిబంధనలు అన్నింటినీ కాలరాసి రైతులను భూ సేకరణ సవరణ 2015 అనే బలిపీఠంపై నిలబెట్టిందని విమర్శించారు.
ఇప్పటికైనా నరేంద్ర మోడీ భూసేకరణ ఆక్రమణ అర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో తమ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని హెచ్చరించా రు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శి పి,కామేశ్వరరావు మాట్లాడు తూ 1992నుంచి నేటివరకు దేశంలో 70లక్షల ఎకరాల పంట భూములు పరిశ్రమలకు, కార్పొరేట్ కంపెనీలకు, ప్రభుత్వ అవసరాలకు ధారాదాత్తం చేశారన్నారు. భూ ఆర్డినెన్స్ ఆమోదించినట్లయితే రైతుల చేతుల్లో భూములు ఉండవని, ప్రజలకు ఆహార భద్రత ఉండదని, రైతు అనే పదాన్ని సమాజం నుంచి తొలగించే దుర్మార్గమైన ఆలోచనతో మోడీ ప్రభుత్వం ఉందన్నారు.
అనంత రం కలెక్టరేట్ రెండవ గేటు వద్ద ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులను అరెస్ట్‌చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వా త ప్రధాన గేటు వద్ద ధర్నా చేస్తున్న 225 మంది అరెస్ట్‌చేసి వన్‌టౌన్ పోలీసు స్టేష న్‌కు తరలించారు. సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమం లో పాల్గొనేందుకు బయలుదేరిన 45 మంది ని బొబ్బిలిలో అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శు లు బుగత అశోక్, ఒమ్మిరమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు వి.కృష్ణంరాజు, ఆల్తి అప్పలనాయుడు, బుగత సూరిబాబు, బాయి రమణమ్మ మండంగి నర్సిం హు లు,అలమండ అనందరావు పాల్గొన్నారు.