జిల్లాకు 28,688 దీపం కనెక్షన్లు
తహశీల్దార్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక
సాక్షి, గుంటూరు
దీపం పథకం కింద జిల్లాకు 28,688 వంటగ్యాస్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారులను తహశీల్దార్ల ఆధ్వర్యంలో అయిల్ కంపెనీలు, పౌర సరఫరాల అధికారులు సంయుక్తంగా ఎంపిక చేయూలని ఆదేశించింది. గతంలో ఈ బాధ్యతను ఎంపీడీవోలను నిర్వర్తించేవారు. దీపం కనెక్షన్లను మండల వారీగా కేటాయించనున్నారు. జన్మభూమి కార్యక్రమం ముగిశాక లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. కనెక్షన్ డిపాజిట్ మొత్తం రూ.1450లను ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ట్యూబు కోసం రూ.170, రిజిస్ట్రేషన్‌కు రూ.30, పాసు పుస్తకం కోసం రూ.50, ఇన్‌స్టాలేషన్ చార్జీ రూ.35 రూపాయలను మాత్రం లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. దారిద్య్రరేఖకు దిగువ న ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అన్ని కనెక్షన్లు గ్రౌండ్ అయ్యేనా?
ఏటా ప్రభుత్వం దీపం పథకం కింద భారీ సంఖ్యలో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో గ్రౌండ్ కావటం లేదు. గత ఏడాది జిల్లాకు 28,772 కనెక్షన్లు మంజూరు చేయగా కేవలం 12.977 కనెక్షన్లను మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారు. మిగతా కనెక్షన్లు మిగిలిపోయాయి.
గత మూడు సంవత్సరాలుగా 50 శాతానికి పైగా కనెక్షన్లు మిగిలిపోతున్నాయి. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికే భారీగా కనెక్షన్లు మంజూరు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. కనీసం ఈ ఏడాదైనా అన్ని కనెక్షన్లు గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.