మార్కాపురం క్వారంటైన్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన వారితో మాట్లాడుతున్న మంత్రి సురేష్, ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, ఆర్డీవో శేషిరెడ్డి
సాక్షి, మార్కాపురం: మార్కాపురంలోని జార్జి ఇంజినీరింగ్ కళాశాలలో 74 మంది, కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 91 మంది కరోనా వైరస్ అనుమానితులను పరీక్షల అనంతరం శనివారం విడుదల చేసినట్లు విద్యాశాఖమంత్రి సురేష్, ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, ఆర్డీవో ఎం.శేషిరెడ్డి, తహసీల్దార్ రమేష్ తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం ఉండటంతో, ఇతర ప్రాంతాల నుంచి రావటంతో అధికారులు క్వారంటైన్ సెంటర్లలో వైద్య పరీక్షలు నిర్వహించిన నెగటివ్ రావడంతో స్వగృహాలకు పంపుతున్నట్లు తెలిపారు. (ఏపీలో 190కి చేరిన పాజిటివ్‌లు)
అద్దంకి రూరల్: అద్దంకి క్వారంటైన్ సెంటర్‌లో ఉన్న కరోనా వైరస్ అనుమానితులను శుక్రవారం 111 మందిని డిశ్చార్జి చేసినట్లు తహసీల్దార్ సీతారామయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కరోనా అనుమానితులుగా గుర్తించిన వారిని క్వారంటైన్ సెంటర్‌లో 10 రోజులుంచి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి వారిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేకపోవటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు 111 మందిని శనివారం డిశ్చార్జి చేశారు.
కందుకూరు: కరోనా అనుమానితులుగా క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచిన పలువురిని వైద్య పరీక్షల అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటికి పంపించారు. ఓగూరులోని వైఎస్సార్ ఉద్యానవన కాలేజీలో ఉన్న క్వారంటైన్ కేంద్రంలో దాదాపు 60 మంది వరకు ఉన్నారు. వీరి నుంచి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షల కోసం పంపారు. వీరిలో 17 మందికి సంబంధించి కరోనా నెగటివ్ రిపోర్టులు రావడంతో శనివారం ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి, ఆర్డీవో ఓబులేసు, తహసీల్దార్ శ్రీనివాసరావు దగ్గర ఉండి వారిని ఇళ్లకు పంపించారు.
రెండు కుటుంబాలు క్వారంటైన్‌కు తరలింపు :
హనుమంతునిపాడు: మండల పరిధిలోని హాజీపురం ఎస్సీ కాలనీకి చెందిన రెండు కుటుంబాలు, సీతారంపురం ఎస్సీ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకిందేమని అనుమానంతో కనిగిరి మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు హాజీపురం ఎస్సీ కాలనీకి చెందిన గూడూరి సలోమి, గూడూరి సంతమ్మ ఎస్సీ కమిషనర్‌ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లి మార్చి 15వ తేదీన స్వగ్రామం హాజీపురం వచ్చారు. సీతారాంపురం ఎస్సీ కాలనీకి చెందిన కస్తాల గురువయ్య ఢిల్లీ ఏపీ భవన్‌లో ఉద్యోగం చేస్తూ స్వగ్రామం వచ్చారు. దీంతో కరోనా సోకిందేమోనని అనుమానంతో వైద్యలను కల్సి స్వచ్ఛందంగా కనిగిరి క్వారంటైన్‌లో చేరినట్లు డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, ఎస్సైలు వై.శ్రీహరి తెలిపారు. వారి రక్త నమూనాలు తీసి కరోనా పరీక్షలకు పంపించినట్లు తెలిపారు.
అనుమానిత కేసు ఐసోలేషన్‌కు
చినగంజాం: మండల కేంద్రంలోని అంబేడ్కర్ నగర్‌లో కరోనా అనుమానిత మహిళ కేసును గుర్తించిన టాస్క్‌ఫోర్స్ బృందం శనివారం ఆమె ఇంటిని సందర్శించి పరిశీలించారు. మహిళకు దగ్గు, జలుబుతో ఉండటంతో ఆమెను చీరాల ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment