సాక్షి, హైదరాబాద్: కృష్ణా డెల్టాకు నీటి విడుదల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం ముగిసింది. డెల్టా తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయాల్సిందేనని కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు తాజాగా నిర్ణయించింది. రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున వారం పాటు నీటి విడుదలకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని అమలు చేయాలంటూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌కు సూచించింది. డెల్టాకు 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర స్థాయి కమిటీ ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు రంగంలోకి దిగింది. బోర్డు ఇన్‌చార్జ్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఎ.బి. పాండ్య ఇరు ప్రాంతాల అధికారులతో చర్చించారు.
ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకుని డెల్టాకు నీటిని విడుదల చేయాలని నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్‌కు సూచించారు. దీని ప్రకారం వారం రోజుల పాటు రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలి. ఇలా విడుదల చేసే జలాలు సుమారు 3.5 టీఎంసీల వరకు ఉండొచ్చని అంచనా. వారం తర్వాత ఆయన మళ్లీ ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించనున్నారు.
సీడబ్ల్యూసీకి టీ-సర్కారు లేఖ
బోర్డు నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం కూడా సాగుకూలంగా స్పందించింది. బోర్డు ఆదేశాలు వెలువడిన వెంటనే నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు, ముఖ్య కార్యదర్శి అరవిందరెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. నీటి పరిమాణాన్ని 10 టీఎంసీల నుంచి 3.5 టీఎంసీలకు తగ్గించినందున నిర్ణయాన్ని అమలు చేయాల్సిందిగా ఆయన చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ నీటిని కేవలం తాగునీటి కోసమే వాడుకునే విధంగా పర్యవేక్షించాలని సూచించినట్టు సమాచారం. ఈ మేరకు సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి బి.అరవింద్‌రెడ్డి మంగళవారమే కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌కు లేఖ రాశారు.
రాష్ర్ట స్థాయి కమిటీ ఇక లేనట్లే!
బోర్డు రంగంలోకి దిగి బాధ్యతలను చేపట్టడంతో ప్రస్తుతమున్న రాష్ర్ట స్థాయి కమిటీ రద్దయినట్లేనని అధికారులు భావిస్తున్నారు. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల కార్యదర్శులు, ఇంజనీర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ నిర్ణయం ఇప్పటికే వివాదాస్పదమైనందున భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి ఎదురుకావచ్చని భావించిన కృష్ణా బోర్డు వెంటనే రంగంలోకి దిగి నిర్ణయం తీసుకున్నట్లు సాగునీటి వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఈ వ్యవహారాన్ని ఇరు రాష్ట్రాలకూ గవర్నర్‌గా ఉన్న నరసింహన్ కూడా పర్యవేక్షించారు. బోర్డు నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు ఆయన తాజాగా సూచించారు.