రాజమండ్రి : నగరంలో గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జరిపిన పర్యటన.. అంతకు ముందు ఎంత హడావుడిగా ఖరారైందో అంతే హడావుడిగా జరిగింది. ఒకవైపు వర్షం, మరోవైపు ఆయన రాక ఆలస్యం కావడంతో పర్యటన మూడు గంటల్లోపే ముగిసింది. రాక ఆలస్యం కావడంతో సీఎం పుష్కర పనుల పరిశీలన రద్దు కాగా, సరిగ్గా గంటం పావులో సమీక్షా సమావేశం ముగించి ఆయన విజయవాడ బయలుదేరారు.
పుష్కర పనులు మందకొడిగా సాగుతున్నాయనే విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాజమండ్రి పర్యటనకు వచ్చారు. నిర్ణీత కార్యక్రమం ప్రకారం ఆయన ఉదయం పది గంటలకు ప్రత్యేక విమానంలో మధురపూడి చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్‌లో పట్టిసీమ వెళ్లాల్సి ఉంది. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు మధురపూడి చేరుకుని అక్కడ నుంచి 1.30 గంటలకు కోటిలింగాల, పుష్కరఘాట్‌లను పరిశీలించాలి. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సమీక్షా సమావేశంలో పాల్గొనాలి. అయితే బాబు విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో పట్టిసీమ వెళ్లి, అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు మధురపూడి చేరుకున్నారు.
ఈ సమయంలో రాజమండ్రిలో భారీ వర్షం పడుతోంది. దీనితో ఘాట్‌ల పరిశీలన రద్దు చేసుకుని విమానాశ్రయం నుంచి 4.15 గంటలకు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం చేరుకున్నారు. దారిలో రాజమండ్రి రూరల్ మండలం గాడాలలో మధురపూడి - రాజమండ్రి నాలుగులేన్ల రోడ్డులో నాటిన మొక్కలను పరిశీలించారు. ఆర్ అండ్ బీ అతిథిగృహంలో సుమారు 1.15 గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించిన బాబు అక్కడి నుంచి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 6.30 గంటలకు విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద రాజమండ్రికి చెందిన అర్చక సమాఖ్య నాయకులు ముఖ్యమంత్రిని కలిసి పుష్కరాల సమయంలో పిండప్రదాన, ఇతర కార్యక్రమాలకు ధరలు నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. తమకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞాపన పత్రం అందజేశారు.
ఆద్యంతం గందరగోళం..
ముఖ్యమంత్రి మధురపూడిలో దిగిన వెంటనే పుష్కరఘాట్ పరిశీలనకు వెళుతున్నట్టు చెప్పారు. తరువాత అది కాస్తా రద్దయింది. తర్వాత.. రాత్రికి ఆయన రాజమండ్రి ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బస చేస్తారని, శుక్రవారం ఉదయం ఘాట్‌లను పరిశీలిస్తారనే సమాచారం వచ్చింది. తరువాత అది కూడా రద్దయినట్టు చెప్పారు. చివరకు సమీక్షా సమావేశం తరువాత మీడియాతో మాట్లాడతారని సమాచార శాఖాధికారులు చెప్పినప్పటికీ అది రద్దరుుంది. ‘ఓటుకు నోటు’ కేసు విషయాన్ని మీడియా లేవనెత్తుతోందనే అనుమానంతో బాబు మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్టు తెలిసింది. మొత్తం మీద బాబు జిల్లా పర్యటన 1.15 గంటల సమీక్షతో ముగిసిపోయింది. పర్యటనలో చంద్రబాబు ముభావంగా కనిపించారు. పార్టీ నేతలతో సైతం ఆయన పెద్దగా మనస్సు విప్పి మాట్లాడలేదని సమాచారం.
3 గంటల్లోనే ముగింపు
Published Fri, Jun 19 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM
Advertisement
Advertisement