పెద్ద సారూ.. పట్టించుకోరూ!
► టీడీపీ, బీజేపీల నడుమ నానాటికీ పెరుగుతున్న రచ్చ
►కేంద్రం పథకాలు తమవని తెలుగుదేశం ప్రచారం
► జన్మభూమి కమిటీల పెత్తనంపై కమలదళం గుర్రు
► నేడు రాజమహేంద్రవరానికి బీజేపీ సారథి అమిత్‌షా
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత ఎన్నికల్లో రాష్ట్రంలో మిత్రపక్షాలుగా బరిలోకి దిగిన టీడీపీ, బీజేపీలు.. ఇప్పుడు తరచూ పరస్పర వైరాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ‘ఆత్మ’గా అభివర్ణించే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజమహేంద్రవరం పర్యటన, అక్కడి ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగే సభలో ఆయన చేయనున్న ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకోనుంది. అటు కేంద్రప్రభుత్వంలో తాను భాగస్వామై, ఇటు రాష్ట్రప్రభుత్వంలో బీజేపీని భాగస్వామిని చేసుకున్న టీడీపీ వ్యవహారశైలి ఇప్పుడు రెండుపార్టీల నడుమా రగడకు మూలమవుతోంది.
మరోపక్క రాష్ట్ర విభజన నాటి హామీల నుంచి ఎన్నికల నాటి వాగ్దానాల వరకూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతుంటే మద్దతు ఇవ్వాల్సిన అధికార పార్టీ.. అందుకు భిన్నంగా స్పందించడం కూడా చర్చనీయాంశమైంది. ఇదొక్కటే కాదు.. జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి నిధులు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల సాధనలో బీజేపీ నాయకులను కలుపుకొని వెళ్లుంటే ప్రయోజనం ఉండేదన్న అభిప్రాయం వినిస్తోంది.
ఇటీవల టీడీపీపై బీజేపీ నాయకులు విమర్శల వాన కురిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగేలా పార్టీని బలోపేతం చేసుకుంటామని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కృష్ణంరాజు ఇటీవల చేసిన ప్రకటన దీనికో నిదర్శనం. తెలంగాణలో టీడీపీతో దాదాపు కటీఫ్ చెప్పేసిన బీజేపీ.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తాడోపేడో తేల్చుకోవాలని ఇక్కడి శ్రేణులు బలంగా కోరుకుంటున్నాయంటున్నారు. అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన తాము ఇప్పుడు జన్మభూమి కమిటీలు, నామినేట్ పదవులకు అక్కర్లేదా అని దిగువశ్రేణి నాయకులు బహిరంగంగానే టీడీపీని తప్పు పడుతున్నారు.
సొమ్ము కేంద్రానిది.. సోకు టీడీపీది..
ప్రస్తుతం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకమేదీ చెప్పుకోదగిన స్థాయిలో లేదు. నిర్మాణాత్మకమైనవి కాక తాత్కాలికంగా ఉపయోగపడే చంద్రన్న కానుక వంటివే కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ గృహనిర్మాణం పథకం కింద కాకినాడ, రాజమండ్రి మినహా ఒక్కో నియోజకవర్గానికి 1,250 చొప్పున 19 వేల ఇళ్లను ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనల్లో సవాలక్ష కొర్రీలు, లబ్ధిదారుల ఎంపిక బాధ్యత టీడీపీ కార్యకర్తలతో నిండిపోయిన జన్మభూమి కమిటీలకే అప్పగించడంతో పథకం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. పాత ఇంటిని బాగు చేసుకోవడానికి రూ.10 వేల చొప్పున ఇస్తామన్న ఎన్టీఆర్ నవీకరణ పథకానిదీ అదే పరిస్థితి. ఇదిలాఉంటే గ్రామీణ ప్రాంతాలవారి కోసం ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) కింద 6,213 ఇళ్లు, పట్టణ పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద 24,230 ఇళ్లు గత ఏడాది మంజూరయ్యాయి. చివరకు వీటి లబ్ధిదారుల ఎంపిక కూడా జన్మభూమి కమిటీలకే అప్పగించడంపై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
పోల‘వరం’తో తారస్థాయికి..
జిల్లాకు వరప్రదాయినిలాంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ, టీడీపీ నేతల వాగ్యుద్ధం ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తోంది. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో బీజేపీ మొండిచేయి చూపిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తుంటే.. ఇప్పటివరకూ ఖర్చుచేశామంటున్న రూ.2,300 కోట్లకు సంబంధించి లెక్కాపత్రాలు టీడీపీ ప్రభుత్వం సమర్పించకపోవడం వల్లే ఇలా జరిగిందని, అసలు పనులే జరగనప్పుడు కేంద్రం ఎందుకు నిధులిస్తుందని బీజేపీ శ్రేణులంటున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా అనేక విమర్శల మధ్య చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టును వైఎస్సార్ సీపీతో పాటు బీజేపీ కూడా వ్యతిరేకించింది. ఇటీవల బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు.
పథకాల ప్రచారంలోనూ హైజాక్..
పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కేంద్రం ‘స్వచ్ఛ భారత్’ను ప్రవేశపెట్టింది. అదే కార్యక్రమం రాష్ట్రంలో చేసినా దానికి ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ అని, జిల్లాలో కూడా ఎవరికి తోచినపేర్లు వారు పెట్టేశారు. రోజంతా నిరంతరాయ విద్యుత్తు సరఫరా అందించేందుకు గ్రామాల్లో ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన’, పట్టణాల్లో ‘ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్’లను కేంద్రం అమలు చేస్తోంది. అయితే నిరంతర విద్యుత్తు తమ ఘనతే అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.
చివరకు విద్యుత్తు పొదుపు కోసం కేంద్రం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో 25 లక్షలకు పైగా ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ విషయంలోనూ జన్మభూమి కమిటీలే హల్‌చల్ చేస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ‘పరమ్‌పరాగత్ కృషివికాస్’ పథకాన్ని ప్రారంభించింది. దీన్ని పక్కనపెట్టి సేంద్రియ వ్యవసాయాన్ని తామే ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేస్తోంది.
ఇటీవల కాకినాడలో సుభాష్ పాలేకర్ నేతృత్వంలో నిర్వహించిన పది రోజుల రైతుశిక్షణ కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వోత్కర్ష దీనికి పరాకాష్ట. అందుకే కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే జరిగే నష్టాన్ని ఊహించే బీజేపీ అప్రమత్తమైంది. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో బహిరంగసభ జరిగే వేదికకు సమీపంలోనే ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. కేంద్రం పథకాల పోస్టర్లను ఉంచింది. ఇక అమిత్ షా ప్రసంగం కూడా ఎక్కువగా కేంద్ర పథకాలపైనే ఉంటుందని బీజేపీ నేతలంటున్నారు.
టీడీపీతో కటీఫ్ చెప్పేస్తేనే
ఎన్నికల సమయంలో ఎంతో ప్రేమ చూపించిన టీడీపీ.. తీరా అధికారంలోకి వచ్చాక ‘బోడి మల్లన్న’ సామెత తరహాలో వ్యవహరిస్తోందని అమిత్‌షా దృష్టికి తీసుకు వెళ్లేందుకు బీజేపీ నాయకులు ఉద్యుక్తులవుతున్నారు. మార్కెట్, ఆలయ కమిటీల నుంచి చివరకు జన్మభూమి కమిటీల్లో కూడా చోటు కల్పించకపోవడంపై కారాలుమిరియాలు నూరుతున్నారు. తమ పార్టీకి ఇచ్చిన హామీలను అటకెక్కించినట్లే... ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను సరిగా నెరవేర్చక ప్రజాదరణ కోల్పోతున్న టీడీపీతో కటీఫ్ చెప్పేస్తేనే మంచిదనే వాదన బీజేపీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది.