చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతోంది..
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతోందని, ప్రభుత్వం మొత్తం అవినీతిమయం అయిందని, ఇదే విషయాన్ని అమిత్ షాకు చెప్పామని బీజేపీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు తెలిపారు. ఏపీ పర్యటనలో ఉన్న అమిత్ షా... పార్టీ నేతలతో విడివిడిగా సమావేశం అయ్యారు. భేటీ అనంతరం కావూరి విలేకరులతో మాట్లాడుతూ అన్ని విషయాలు అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు.
క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని, జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు లబ్ది పొందుతున్నారని కావూరి అన్నారు. ఏపీలో జన్మభూమి కమిటీల తీరు అధ్వాన్నంగా ఉందన్నారు. ఏ విషయంలోనూ బీజేపీని టీడీపీ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. మిత్రపక్షం కాబట్టి టీడీపీ ఉన్న వ్యతిరేకత బీజేపీపై పడుతుందన్నారు.
నిబద్ధత కలిగిన నేతల వ్యాఖ్యలపైనే తాను స్పందిస్తానని, ఎంపీ కేశినేని నాని లాంటి వారి వ్యాఖ్యలపై తాను స్పందించనన్నారు. రాజీవ్‌గాంధీ మరణం తర్వాత ఫలితాలు తారుమారు అయ్యాయని, ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని... ఏదైనా జరగవచ్చని కావూరి అన్నారు. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలిపారు.