- జులై 1 నుంచి రాష్ట్రమంతా మొక్కలు నాటే కార్యక్రమం
- అనంతవరం వన మహోత్సవంలో సీఎం చంద్రబాబునాయుడు
విజయవాడ
రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల స్కూళ్లలో నర్సరీలను అభివృద్ధి పర్చనున్నామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. డ్వాక్రా మహిళలకు మొక్కల పెంపకం బాధ్యతతో పాటు.. స్కూళ్ల మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని ప్రకటించారు. పచ్చదనం పెంపులో భాగంగా ప్రతి హైస్కూల్‌నూ నర్సరీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వివరించారు.
రాజధాని అమరావతి పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్నారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 15 లక్షల మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఏడాదికి 50 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. బ్లూ అండ్ గ్రీన్ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో అడవుల విస్తరణకు రూ.350 కోట్లు వెచ్చిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇకపై ఏటా జులై 1వ తేదీ నుంచి రాష్ట్రంలో మొక్కలు నాటే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, మంత్రిపత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, నక్కా అనందబాబు, మాజీ మంత్రి పుష్పరాజ్, నన్నపనేని రాజకుమారి, ఏఎస్ రామకృష్ణ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే ఫరీదా పాల్గొన్నారు.