మా ముందే ముగ్గురు నేలకొరిగారు
- 16 ఏళ్లు గడిచినా కాల్పుల దుర్ఘటన మరువలేను..
- ప్రదర్శనకు అనుమతి ఇచ్చిన బాబు ప్రభుత్వం పొట్టనపెట్టుకుంది
- బషీర్‌బాగ్ కాల్పులపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వైవీ
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు హయాంలో పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని మాతోపాటు నినదించిన వారిలో ముగ్గురు మా కళ్లముందే పోలీస్ తూటాలకు కుప్పకూలిపోయారు.. 16 ఏళ్లు గడిచినా ఆ విషాద ఘటన గుర్తొస్తే గుండె బాధతో బరువెక్కుతోంది..’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు (వైవీ) ఆవేదన వ్యక్తం చేశారు. 2000లో బషీర్‌బాగ్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన వి.బాలస్వామి, సత్తెనపల్లి రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డిల సంస్మరణ సభను ఆదివారం విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఆ దుర్ఘటనను ప్రత్యక్షంగా చూసిన వైవీ మాట్లాడుతూ పోలీసులు హెచ్చరికలు లేకుండా కాల్పులకు దిగడంతో ఉద్యమకారులను కోల్పోయామని చెప్పారు.
విద్యుత్ చార్జీలు తగ్గించాలని పది వామపక్షాలు, కాంగ్రెస్ వేర్వేరుగా మూడు నెలలపాటు ఆందోళన నిర్వహించిన అనంతరం 2000 ఆగస్టు 28న చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చాయన్నారు. శాంతియుత ర్యాలీకి అనుమతి ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి బషీర్‌బాగ్‌లో అకస్మాత్తుగా కాల్పులకు పురిగొల్పిందని చెప్పారు. తాను మారానని ప్రజలను నమ్మించి 2014 ఎన్నికల్లో గద్దెనెక్కిన చంద్రబాబు మళ్లీ అన్ని రంగాల్లోను సంస్కరణలు వేగంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం పవన్‌కల్యాణ్ పోరాడతానని ప్రకటించడం అభినందనీయమన్నారు.