- 30, 31 తేదీల్లో చంద్రబాబు జిల్లా పర్యటన
- జిల్లా మంత్రుల ఆమోదంతోనే తుది షెడ్యూల్
- ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
నక్కపల్లి/యలమంచిలి/అనకాపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 30న నక్కపల్లి, ఉపమాకలలోనూ, 31న చోడవరంలోను పర్యటిస్తారని కలెక్టర్ యువరాజ్ వెల్లడించారు. యలమంచిలి, ఉపమాకలో సీఎం పర్యటించనున్న ప్రాంతాలను, నక్కపల్లిలో బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ శుక్రవారం అధికారులతో కలసి పరిశీలించారు.
సీఎం ముందుగా ఉపమాకలో వెంకన్న దర్శనం తర్వాత టూరిజం శాఖ మంజూరు చేసిన రూ.25లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని, అనంతరం ప్రజలతో ముఖాముఖి, సహపంక్తి భోజనాలు, బంధుర సరస్సు వద్ద మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని తెలి పారు. నక్కపల్లిలో బహిరంగ సభ పాఠశాల ఆవరణలోనా, లేదా చినజీయర్‌స్వామి నగర్‌లోనా అనేది త్వరలో నిర్ణయిస్తామని కలెక్టర్ చెప్పారు. అంతకు ముందు యలమంచిలిలో అధికారులతో కలిసి పర్యటించారు. ఉపాధి పనుల్లో ఉద్యానవన శాఖ నుంచి రైతులకు మొక్కల పంపిణీని ముఖ్యమంత్రి ద్వారా ప్రారంభించనున్నట్టు తెలిపారు.
పురుషోత్తపురం వద్ద రైతులతో మాట్లాడారు. అనకాపల్లిలో కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ 30 వతేదీ రాత్రి కశింకోటలోగాని, ఎంపీ క్యాంపు కార్యాలయంలోగాని సీఎం చంద్రబాబు బసచేసే అవకాశం ఉందన్నారు. 31న ఆర్‌ఏఆర్‌ఎస్‌లో రైతులతో సదస్సు, కశింకోటలో బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా పాఠశాల కమిటీలతో సమావేశం ఉండొచ్చన్నారు. అయితే సీఎం పర్యటన జిల్లాలోని ఇద్దరు మంత్రుల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు.
అంతకుముందు కలెక్టర్ ఆర్‌ఏఆర్‌ఎస్, అనకాపల్లి మున్సిపల్ స్టేడియాన్ని, సాయంత్రం కశింకోటలోని సరోజిని అతిథి గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ పర్యటనల్లో పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద, జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్, జెడ్పీ సీఈఓ మహేశ్వరరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, అనకాపల్లి ఆర్డీవో వసంతరాయుడు, డ్వామా పీడీ శ్రీరాములు,ఆయామండలాల అధికారులుపాల్గొన్నారు.
31న చోడవరంలో ‘రైతు సదస్సు’
చోడవరం: సీఎం చంద్రబాబు 31వ తేదీన చోడవరం రానున్నారు. ఈ మేరకు చోడవరంలో నిర్వహించ తలపెట్టిన రైతు సదస్సుకు జూనియర్ కళాశాల మైదానాన్ని కలెక్టర్ యువరాజ్, ఆయా శాఖల అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. సదస్సుకు అనుకూలంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఉపమాక వెంకన్నను ద ర్శించుకున్న కలెక్టర్
ఈ పర్యటనలో భాగంగా కలెక్టర్ యువరాజు, ఎమ్మెల్యే అనిత తదితరులు ఉపమాక వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అర్చకులు గోత్రనామాలతో అర్చన చేసి ప్రసాదాలు అందజేశారు.
మొక్కు తీర్చుకోనున్న చంద్రబాబు!
ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు, అధికారంలోకి వస్తే ఉమమాక వెంకన్నను దర్శించుకుంటానని మొక్కుకున్నారని, ఇందులో భాగంగా ఈ నెల 30 బాబు ఉపమాక వస్తున్నారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. అనకాపల్లి నూకాంబికనూ దర్శించుకుంటారని తెలిపాయి.