హైదరాబాద్ : ఉగాది పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు విభాగంలో ఉత్తమ సేవలందించిన వారికి ఏటా ఇచ్చే పతకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ ఏడాది అన్ని విభాగాల్లోనూ కలిపి 300 మంది పోలీసులకు వివిధ పతకాలు దక్కాయి. గుంటూరు రూరల్ జిల్లాల్లో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఐ పోతుల నర్సింహారావు, కానిస్టేబుల్ షేక్ సైదు నాసర్ (పీసీ-439), గ్రేహౌండ్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఎం.రాజేష్ (ఎస్సీ-5704), ఎన్.రామాంజనేయులు (జేస్సీ-7271), పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎర్రవరపు వెంకటేశ్వరరావు (పీసీ-1393)లకు విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు ముఖ్యమంత్రి శౌర్యపతకాలు లభించాయి. ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కమాండెంట్ షేక్ హుస్సేన్ సాహెబ్, స్పోర్ట్స్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న కె.సూర్యభాస్కర్‌రెడ్డి, నెల్లూరు సీసీఎస్ ఎస్.ఐ. షేక్ షరీఫ్‌లకు రాష్ట్ర పోలీసు మహోన్నత సేవాపతకం లభించింది.
వీటితోపాటు పోలీసు విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న 37 మందికి ఉత్తమ సేవ, 30 మందికి కఠిన సేవ, 160 మందికి పోలీసు సేవాపతకాలు లభించాయి. మరోవైపు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పనిచేస్తున్న ముగ్గురికి ఉత్తమ సేవ, 13 మందికి పోలీసు సేవాపతకాలు లభించాయి. అగ్నిమాపక శాఖలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురికి ఉత్తమ సేవ, 25 మందికి సేవాపతకాలు లభించాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురికి ఉత్తమ సేవ, పది మందికి పోలీసు సేవాపతకాలు లభించాయి. అవినీతి నిరోధక శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారికి ఉత్తమ సేవ, ఆరుగురికి సేవ, అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న ముగ్గురికి ఉత్తమ సేవ, పది మందికి సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆయా అధికారులకు ఈ పతకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేస్తారు.
300 మంది పోలీసులకు సేవా పతకాలు
Published Sat, Mar 21 2015 8:28 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement