వచ్చే ఉగాదికి మెట్రో పరుగులు: ఎన్వీఎస్‌రెడ్డి
మాదాపూర్: నగరంలో మెట్రో రైళ్లు వచ్చే ఉగాదికి (మార్చి 21, 2015) పరుగులు తీయనున్నాయని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. మాదాపూర్ హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్న ‘ఆగస్ట్ ఫెస్ట్’ ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో 200 మహా నగరాల్లో మెట్రో వ్యవస్థ ఉందని, వాటికి భిన్నంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తీర్చి దిద్దుతున్నట్టు చెప్పారు.
ఎన్నో అవాంతరాలను అధిగమించినగర మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రపంచంలో మౌలిక వసతుల రంగంలో విశిష్టమైన ‘గ్లోబల్ ఇంజినీరింగ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును సొంతం చేసుకుందని ఆయన గర్తు చేశారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ సామాన్య, మధ్య తరగతి, వేతన జీవులును దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేశామన్నారు. స్టేషన్లలో సంగీత విభావరి, ఆర్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించే వీలుంటుందని తెలిపారు. వికలాంగులకు ఇబ్బందులు లేకుండా స్టేషన్లను ఉంటాయన్నారు.
అన్ని వేళలా మహిళలు నిర్భయంగా ప్రయాణం చేయవచ్చన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పెద్ద దేశాలలో కొత్త సంస్థలు నెలకొల్పితేనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో పర్యావరణ వేత్త సాద్ బిన్ జంగ్, హైదరాబాద్ మెట్రో స్టేషన్ డిజైనర్, ఆర్కిటెక్ సుశీల్‌వర్మ, నిర్వాహకులు రమేశ్ లోకనాథన్ తదితరులు పాల్గొన్నారు.