314వ రోజు పాదయాత్ర డైరీ | 314 day :Ys jagan padayatra dairy | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 7 2018 2:05 AM | Last Updated on Fri, Dec 7 2018 2:18 AM

314 day :Ys jagan padayatra  dairy - Sakshi

ఇప్పటి వరకు నడిచిన దూరం 3,400.7  కిలోమీటర్లు
06–12–2018, గురువారం
ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా

నాన్నగారి పథకాలు దేశవిదేశాల్లో  ప్రాచుర్యం పొందడం గర్వంగా అనిపించింది..
భారత రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తపించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి పాదయాత్ర మొదలుపెట్టాను. నాన్నగారు ఆ మహనీయుడి పేరు మీద ఎచ్చెర్లలో యూనివర్సిటీ ఏర్పాటుచేయడం గొప్పగా అనిపించింది. సాయంత్రం ఆ యూనివర్సిటీ ఎదురుగా వెళుతున్నప్పుడు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఎంతో ఆత్మీయంగా స్వాగతించారు.సిబ్బందిని కూడా నియమించని ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం.. యూనివర్సిటీని కళావిహీనం చేసిందని వాపోయారు. 

ఉదయం అంబేడ్కర్‌ సేవా సమితి, జై భీమ్‌ యువజన సంఘం ప్రతినిధులు తదితరులు కలిశారు. కొద్ది నెలల కిందట కొత్తవలస గ్రామంలో టీడీపీ నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి అపచారం చేసిన విషయం చెప్పారు. కనిమెట్ట ఎస్సీ కాలనీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు మంజూరైనప్పటికీ అభివృద్ధి పనులు జరక్కుండా జన్మభూమి కమిటీలు అడ్డుకున్నాయని తెలిపారు. 30కి పైగా ఎస్సీ కుటుంబాలు నాలుగు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న ఐదెకరాల భూమిని నీరు–చెట్టు పేరుతో జన్మభూమి కమిటీలు తవ్వేశాయని, చెరువులో కలిపేశాయని ముషినివలస గ్రామస్తులు మండిపడ్డారు. అంబేడ్కర్‌ యూనివర్సిటీ నిర్లక్ష్యానికి గురవడం, ఆయన విగ్రహాలకు అపచారం జరగడం, గ్రామగ్రామానా జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా అరాచకాలు చేస్తుండటం, పాలించేవారు రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేసేలా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనడం.. ఇవన్నీ చూస్తుంటే ఇదేనా రాజ్యాంగాన్ని రచించిన ఆ మహనీయుడికి ఇచ్చే నివాళి.. అనిపించింది.  

తిత్లీ దెబ్బకు తీవ్ర నష్టం వాటిల్లినా ఈ ప్రభుత్వం పరిహారం ఇవ్వడంలేదని లోలుగు వద్ద కుమ్మరులు వాపోయారు. తమ గ్రామాల వద్దనున్న కెమికల్‌ ఫ్యాక్టరీ వదిలే వ్యర్థాలు జీవితాలను కబళించి వేస్తున్నాయని కేశవదాసుపురం, నర్సాపురం అగ్రహారం గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. నీరు కలుషితమై కిడ్నీ, క్యాన్సర్‌ తదితర జబ్బులు ప్రబలుతున్నాయన్నారు. భూములు నిస్సారమైపోతున్నాయని వాపోయారు.  

వైఎస్సార్‌ అంటే వల్లమాలిన అభిమానం.. ఆయనే మా నిజమైన హీరో.. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 పథకాలు మా రాష్ట్రంలోనూ అమలుచేస్తున్నారంటూ సంబరపడ్డారు.. ఒడిశా నుంచి వచ్చి నన్ను కలిసిన యువకులు. నాన్నగారి పథకాలు దేశవిదేశాల్లో ప్రాచుర్యం పొందడం, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం చాలా గర్వంగా అనిపించింది.

జన్మభూమి కమిటీల అరాచకాలకు, పాలక నేతల కక్ష సాధింపు చర్యలకు పరాకాష్టగా నిలిచిన ఘటన ఈ రోజు నా దృష్టికొచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే.. పొందూరు మండలంలో 880 మందికి అన్ని అర్హతలున్నా నిర్దాక్షిణ్యంగా పింఛన్‌లు పీకేశారట. మంచానికే పరిమితమైపోయిన దివ్యాంగులకు సైతం వైకల్యమే లేదనడం.. బతికి ఉన్న వాళ్లను కూడా చనిపోయినట్టు చూపించడం.. భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న వితంతువులకు భర్తలు బతికే ఉన్నారంటూ పింఛన్లు పీకేయడం ఎంత దారుణం! ‘నేను చనిపోలేదు బతికే ఉన్నా’అని పింఛన్‌ కోల్పోయిన అమ్మణ్ణమ్మ అనే అవ్వ కోర్టుకు పోయి మొరపెట్టుకోవాల్సి వచ్చింది. భర్త చనిపోయినా.. నువ్వు వితంతువు కాదంటూ మెట్ట లక్ష్మి అనే సోదరి పింఛన్‌ను ఆపేశారు. ‘ఈ పింఛన్‌ అక్కర్లేదు.. నా భర్తను చూపెట్టండి చాలు’.. అంటూ న్యాయమూర్తిని వేడుకుందట ఆ అభాగ్యురాలు. ఇలాంటి కేసులన్నీ విన్న న్యాయమూర్తులు దిగ్భ్రాంతికి గురై ప్రభుత్వానికి అక్షింతలు వేశారట. కోర్టును ఆశ్రయించిన 498 మందికి బకాయిలతో సహా పింఛన్లు ఇవ్వాలని ఆదేశించారట. ఈ పాలకులకు ఇది చెంపపెట్టే. పింఛనే జీవనాధారంగా బతికే నిరుపేదల కడుపుకొట్టడం న్యాయమేనా? ఈ న్యాయపోరాటం సాగుతున్న సమయంలోనే 40 మంది లబ్ధిదారులు చనిపోయారట. వారి జీవనాధారమైన పింఛన్‌ ఆపేసి వారి ఉసురు తీసిన ప్రభుత్వానిదే బాధ్యత కాదా? వారి కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారు?  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఒకటి కాదు.. రెండు కాదు.. అన్ని జిల్లాల్లో వేలాది మంది కోర్టుకెళ్లి తమకు నిలిపేసిన పింఛన్లు తెచ్చుకోవడం మీకు సిగ్గుచేటైన విషయం కాదా? కోర్టుకెళ్లలేని నిస్సహాయులు లక్షల్లో ఉండటం వాస్తవం కాదా? ఇదిలా ఉంటే.. సంతృప్త స్థాయిలో పింఛన్లు ఇచ్చేశామని చెప్పుకోవడం ఆత్మవంచన కాదా? అర్హత ఉండి.. పింఛన్లు రానివారెవ్వరూ లేరని ప్రచారం చేయడం.. ఎవర్ని మోసం చేయడానికి?  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement