ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రజల కష్టాలు తెలుసుకుని, వారికి భరోసా ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 337వ రోజు శనివారం అత్యంత కీలక ఘట్టానికి చేరుకుంది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని బారువ జంక్షన్ వద్ద 3,600 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది. ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం వరకూ పాదయాత్రలో భాగంగా ఇప్పటికే 1,000, 2,000, 3,000 కిలోమీటర్ల దూరాన్ని అలవోకగా అధిగమిస్తూ వచ్చిన వైఎస్ జగన్.. 3,600 కిలోమీటర్ల మైలురాయిని కూడా శనివారం సాయంత్రం అశేష జనవాహిని మధ్య అధిగమించారు. ఉదయం ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని సోంపేట మండలం తురకశాసనం వద్ద ప్రారంభమైన పాదయాత్ర.. పాలవలస గేటు, కొర్లాం, బారువ క్రాస్, లక్కవరం క్రాస్ వరకూ సాగింది.
జనకెరటం.. ఘనస్వాగతం
సముద్ర తీరానికి దగ్గరలో సోంపేట మండలంలో శనివారం సాగిన ఆయన పర్యటనలో జన కెరటం ఎగసిపడింది. అక్కచెల్లెమ్మలు హారతులు పట్టారు. యువత ఉత్సాహంగా కేరింతలుకొడుతూ ఘనస్వాగతం పలికారు. సరిగ్గా బారువ జంక్షన్ వద్దకు రాగానే 3,600 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించడంతో జగన్ అక్కడ ఓ వేప మొక్కను నాటి పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. జనహోరు మధ్య కదిలిన జగన్‌కు దారి పొడవునా వివిధ వర్గాల ప్రజలు తమ కష్టాలు చెప్పుకొన్నారు.
రాజకీయ వివక్ష
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రాజకీయ వివక్ష చూపుతోందని పలువురు బాధితులు వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల సంభవించిన తుపానుకు నష్టపోయినవారు ఈ విషయంపై ప్రతిపక్ష నేతకు ఫిర్యాదు చేశారు. పలువురు ఉద్యోగ సంఘాలవారు జగన్‌ను కలిసి.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు.. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న దుర్మార్గమైన విధానాల వల్ల లక్షలాది మందికి ఉద్యోగ అభద్రత ఏర్పడిందని చెప్పారు. పాలవలస గ్రామం వద్ద కొందరు కలిసి.. తమ ఊర్లో పెద్ద సంఖ్యలో కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదని, అందువల్ల తామే ఓ స్వచ్ఛంద సంస్థగా ఏర్పాటై ఆదుకుంటున్నట్లు వివరించారు.
ఉల్లికి గిట్టుబాటు ధర లేదయ్యా..
వైఎస్సార్ జిల్లా మైదుకూరు నుంచి వచ్చిన ఉల్లి రైతులు కొందరు.. తమకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని జగన్‌కు మొరపెట్టుకున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా తమ పంటను కొనుగోలు చేయించాలని విజ్ఞప్తిచేశారు. గతేడాది క్వింటా ఉల్లి రూ.7,000 పలికితే.. ఈ ఏడాది రూ.1,500కు పడిపోయిందని.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడం లేదని అవ్వలు, దివ్యాంగులు ప్రతిపక్ష నేతకు ఫిర్యాదు చేశారు. వారితో పాటు ఫీజురీయింబర్స్ కావడం లేదని, ఆరోగ్యశ్రీ వర్తించ లేదని, సంక్షేమ పథకాల అమల్లో పార్టీ వివక్ష చూపుతున్నారని, జన్మభూమి కమిటీల అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోయిందని.. ఇలా పలువర్గాల వారు జగన్‌కు ఫిర్యాదు చేశారు. అందరి సమస్యలు ఓపికగా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే.. అంతా మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు. సాధారణంగా రాజకీయ నాయకులు వచ్చి పార్టీలో చేరడం తరచూ జరిగేదే.. కానీ శనివారం అసలే పార్టీతోనూ సంబంధంలేని.. రాజకీయ నేపథ్యమే లేని ఓ కుటుంబం పాదయాత్ర సాగుతున్న చోటికొచ్చి వైఎస్ జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా వేయించుకున్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు, ఆయన సంకల్పంతో తాము స్ఫూర్తి పొందినట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపుకోసం కృషిచేస్తామని వారు వివరించారు.
కక్షతో తొలగించారు
అన్నా.. సాక్షర భారత్ మండల, గ్రామ కోఆర్డినేటర్లను ఈ ప్రభుత్వం కక్షతో తొలగించింది. తొమ్మిదేళ్లు శ్రమించి పనిచేశాం. ప్రభుత్వం అనేక పనులు అప్పగించినా వాటిని పూర్తిచేశాం. అయినా అకారణంగా మమ్మల్ని తొలగించారు. వేలాది మందికి జీవనోపాధి లేకుండా చేశారు.
– ఇచ్ఛాపురం సాక్షర భారత్ కో–ఆర్డినేటర్ల యూనియన్ నేతలు
ఉల్లిపంటకు గిట్టుబాటు ధర రానీయడం లేదు
అన్నా.. ఉల్లిపంటకు గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్నాం. గతేడాది క్వింటా రూ.7 వేలు పలికిన ఉల్లి.. నేడు రూ.1,500కు పడిపోయింది. ఎక్స్‌పోర్ట్ రకం చిన్నబళ్లారికి సింగపూర్‌లో గిరాకీ ఉన్నప్పటికీ దళారుల సిండికేట్‌తో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక సాధారణ రకం పెద్దబళ్లారి మార్కెట్‌లో కిలో రూ.2 పలుకుతోంది. కనీసం రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. మార్కెఫెడ్ ద్వారా ఉల్లిని కొనుగోలు చేస్తే కొంతవరకు దళారుల దోపిడీ తగ్గుతుంది. దీనిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – జి.ఓబుల్‌రెడ్డి, షరీఫ్, చంద్ర ఓబుల్‌రెడ్డి, మైదకూరు, వైఎస్సార్‌కడప జిల్లా.
పైడిగాం ప్రాజెక్టును పునరుద్ధరించాలి
1962లో నిర్మించిన పైడిగాం ప్రాజక్టు పూర్తిగా దెబ్బతింది. తిత్లీ తుపానుకు పాడైపోయింది. సాగునీరందడం లేదు. ప్రాజెక్టు పునరుద్ధరణ, ఆధునికీకరణ చేస్తే 10 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. సోంపేట, ఇచ్ఛాపురం, పలాస ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేయండయ్యా..
– సింగాన భాస్కరరావు, సుంకిడి, సోంపేట మండలం
నేతన్న కోసం.. వడ్డెరన్న కోసం..
శ్రీకాకుళం అర్బన్: గుంటూరు జిల్లా బెల్లంకొండ జెడ్పీటీసీ సభ్యుడు మురుగుడు రాఘవేంద్రరావు.. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ జగన్ చేతులమీదుగా ‘నేతన్న కోసం జగన్.ఇన్’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభింపజేశారు. అలాగే వైఎస్సార్‌సీపీ గుంటూరు జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ల రేవతి.. ‘వడ్డెరన్న కోసం జగన్.ఇన్’ అనే వెబ్‌సైట్‌ను ప్రతిపక్షనేత చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. చంద్రబాబు పాలనలో చేనేతలు, వడ్డెరలు రోడ్డునపడ్డారని, వైఎస్సార్ తర్వాత మళ్లీ వైఎస్ జగన్ పాలనలోనే తమకు మేలు జరుగుతుందని వారుచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment