సాక్షి ప్రతినిధి, అనంతపురం: హిందూపురం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఉదయం ఆయన టీడీపీకి రాజీనామా చేసి, ఆ ప్రతిని చంద్రబాబునాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఘనీకి జగన్ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఇదిలాఉంటే ‘అనంత’ తెలుగుదేశం పార్టీ మైనార్టీ వర్గంలో ఘని కీలక నేత. 2009లో హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2014లో నందమూరి బాలకృష్ణ ‘పురం’ నుంచి పోటీ చేయడంతో టీడీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ టిక్కెట్ నిరాకరించింది. మైనార్టీలకు టీడీపీలో సరైన గుర్తింపు దక్కకపోవడం, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చకపోవడంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారు. ఈయన రాజీనామాతో హిందూపురం లో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో బాలకృష్ణ విజయం కోసం ఘని తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్‌సీపీలో చేరడంతోమైనార్టీ నేతలంతా దాదాపు టీడీపీకి దూరమైనట్లే.
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ఇష్టపడి సామాన్య కార్యకర్తలా వైఎస్సార్‌సీపీలో చేరాను. పార్టీ అధినేత ఏ బాధ్యతలు అప్పగించినా శక్తివంచన లేకుండా పార్టీ అభ్యున్నతికి పాటుపడతా. మైనార్టీలకు టీడీపీలో ఏ మాత్రం గౌరవం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నన్ను పక్కనపెట్టారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఎక్కడా మైనార్టీలకు స్థానం కల్పించలేదు. మైనార్టీలకు గతంలో న్యాయం చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే. భవిష్యత్తులో కూడా జగన్‌మోహన్‌రెడ్డితోనే మైనార్టీలకు న్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లకు ఆయన కట్టుబడి ఉన్నారు. హిందూపురం పార్లమెంట్‌లో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి, నియోజకవర్గంపై ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యతారాహిత్యం అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో ‘పురం’లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇన్నాళ్లూ నన్ను ఆదరించిన మైనార్టీ సోదరులు, పురం నియోజకవర్గ ప్రజలు ఇక మీదట కూడా అండగా ఉండాలని కోరుకుంటున్నా.
Comments
Please login to add a commentAdd a comment