350 బస్తాల రేషన్ బియ్యం సీజ్
Published Wed, Aug 28 2013 4:10 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
ఏటీ అగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్ : రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర జిల్లాలకు తరలిస్తున్న ముఠా గుట్టు బట్టబయలైంది. లారీలో తరలిస్తున్న 350 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. సీజ్‌చేసిన లారీని విజిలెన్స్ కార్యాలయం వద్దకు తరలించారు. విజిలెన్స్ ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు. నర్సరావుపేట మండలం రూపెనగుంట్ల గ్రామానికి చెందిన కఠారి ఏడుకొండలు, సోము శ్రీనివాసరావు, అప్పారావు, ఆతుకూరి వెంకటరామయ్య, భావనాసి రమేష్ ముఠాగా ఏర్పడి సమీప గ్రామాల్లోని రేషన్ డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని తూర్పుగోదావరి జిల్లా, మండపేటలోని సాయిరామ్ రైస్‌మిల్లుకు తరలించేందుకు లారీని బాడుగకు తెచ్చుకున్నారు. సోమవారం రాత్రి 350 బస్తాల రేషన్ బియ్యాన్ని లారీలో లోడుచేశారు.
మంగళవారం తెల్లవారుజామున లారీ బయలుదేరింది. గుంటూరు బైపాస్‌లోని ఏటుకూరి ఆంజనేయస్వామి విగ్రహం వద్ద లారీ ఆగి ఉన్నట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందడంతో డీఎస్పీ అనిల్‌బాబు, సీఐ వంశీధర్, సిబ్బంది అక్కడికి చేరుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు. నర్సరావుపేటకు చెందిన డ్రైవర్ బంటుపల్లి రామయ్యను అరెస్టు చేశారు. గతంలోనూ రేషన్ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడిన ఆ ఐదుగురు ముఠా సభ్యులతోపాటు కారంపూడికి చెందిన లారీ యజమాని డి.శ్రీనివాసరావుపై కూడా 6-ఎ కేసులతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. ఆయనవెంట డీఎస్పీ అనిల్‌బాబు, ఎస్సై ఖాసిం సైదా, సిబ్బంది ఉన్నారు.
నకిలీలపై పూర్తి నిఘా
చీకటి, నకిలీ వ్యాపారులపై నిరంతరం పూర్తిస్థాయిలో నిఘా కొనసాగుతూనే ఉంటుందని అమ్మిరెడ్డి చెప్పారు. తన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తున్న 4.5 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామన్నారు. 40 కేసులు నమోదు చేశామని, 7,300 లీటర్ల నీలి కిరోసిన్, 1141 గ్యాస్ సిలిండర్లను గుర్తించి 6-ఎ కేసులు 150 నమోదు చేసినట్టు వివరించారు. 52 వాహనాలను సీజ్‌చేసి 81 మందిపై క్రిమినల్ కేసులు నమోదుచేశామన్నారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి విక్రయిస్తున్న 32 రైస్ మిల్లులను సీజ్ చేశామని తెలిపారు. జిల్లాలో నకిలీ వ్యాపారాలపై 80082 03288 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
Advertisement