తాడేపల్లిరూరల్: సివిల్ సప్లయీస్ అధికారులు దొంగ చేతికి తాళాలు ఇచ్చి చేతులు దులుపుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... ఈనెల 7వ తేదీన తాడేపల్లి రూరల్ ప్రాంతంలోని ఇప్పటం శివారుల్లో రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోకి పంచర్ అయ్యింది. ఆటోలో ఉన్న రేషన్ బియ్యాన్ని సగం వరకు దించి ముళ్ల పొదల్లో పెట్టి పంచర్ వేసుకుంటున్నారు. ఆ సమయంలో పొలాలకు వెళుతున్న గ్రామస్తులు గమనించి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. రెవెన్యూ అధికారులు సంఘటనా స్ధలానికి వెళ్లి ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ముళ్ల పొదల్లో ఉన్న బియ్యాన్ని ఆటోలోకి ఎక్కించి ఇప్పటం గ్రామంలో భద్రపరిచారు.
ఈ సంఘటనపై వీఆర్వో సివిల్ సప్లయీస్ డీటీకి అదేరోజు సమాచారం ఇచ్చారు. ఇప్పటి వరకు ఆటోపైగానీ, ఆటోలో బియ్యాన్ని తరలిస్తున్న వారిపై గానీ ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం విశేషం. ఆటోలో ఉన్న రేషన్ బియ్యాన్ని దగ్గరలో ఉన్న రేషన్ షాపులో ఉంచి ఆటోను మాత్రం మూడు రోజుల అనంతరం వడ్లపూడిలోని ఒక రైస్‌మిల్లుకు తరలించారు.
గతంలో ఇదే రైస్‌మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి పలుమార్లు కేసులు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లుకు ఆటోను పంపండం వెనుక ఆంతర్యం ఏమిటో అర్ధంకావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆటో యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చేవని, అలా చేయకుండా మంగళగిరి సివిల్ సప్లయీస్ అధికారులు ఆటోను రైస్‌మిల్లులో భద్రపరచడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment