జిల్లాలో ఇప్పటికీ 38.3 శాతమే ఆధార్ సీడింగ్
Published Fri, Aug 30 2013 12:39 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నగదు బదిలీ పథకం అమలుకు గడువు దగ్గర పడింది. సెప్టెంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులను వినియోగదారుల ఖాతాల్లో జమ చేయనున్నామని, ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పులు లేవంటూ గురువారం కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో రెండ్రోజుల్లో ఈ పథకం అమల్లోకి రానుండగా.. అధికారుల నిర్వాకం వినియోగదారులను అయోమయంలో పడేసింది. నగదు బదిలీ పథకం అమలు చేయాలంటే వినియోగదారుడి ఆధార్ సంఖ్యను అతని వ్యక్తిగత బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయాల్సి ఉంది. అయితే జిల్లాలోఈ ప్రక్రియ మూడో వంతు మాత్రమే పూర్తికావడం వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
38.3 శాతమే..!
జిల్లాలో 13.23లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీటిలో ఇప్పటివరకు 9,01,431 వినియోగదారుల క నెక్షన్లు ఆధార్‌తో అనుసంధానమైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ఇందులో కేవలం 38.3శాతం వినియోగదారుల వివరాలు మాత్రమే బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేశారు. మొత్తంగా 5,07,319 మంది వినియోగదారుల ఆధార్ వివరాలు మాత్రమే బ్యాంకు ఖాతాతో అనుసంధానమయ్యాయి. ఈ ప్రక్రియ దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతుండడంతో ఈ మేరకు పూర్తి చేశారు. అయితే మరో రెండ్రోజుల్లో ఆధార్, బ్యాంకు ఖాతాల సీడింగ్‌కు గడువు ముగియనుంది. అయితే ఈ రెండ్రోజుల్లో సీడింగ్ ప్రక్రియ పూర్తి చేయడం కష్టమే.!
సీడింగ్ పూర్తై వారికే రాయితీ
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి గ్యాస్ డీలర్‌కు మార్కెట్ ధర చెల్లించి వినియోగదారుడు గ్యాస్ సిలిండర్ పొందాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వమిచ్చే రాయితీ నేరుగా వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అయితే ఆధార్, బ్యాంకు ఖాతా సీడింగ్ పూర్తి చేసిన వారికి మాత్రమే రాయితీ జమచేస్తారు. మిగిలిన వారికి ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత రాయితీ అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయడం అంత సులువు కాదు. దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతున్నప్పటికీ.. జిల్లాలో కేవలం 38.3శాతం మాత్రమే పూర్తికాగా.. వందశాతం పూర్తి చేయాలంటే చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ లెక్కన వినియోగదారులకు అప్పటివరకు వచ్చే రాయితీ ఎలా చెల్లిస్తారనే అయోమయం నెలకొంది. ఈ విషయంపై అధికారులు సైతం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.
Advertisement
Advertisement