వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హడావుడి నివేదిక
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనాల ప్రభావంతో కురిసిన వర్షాలకు రాష్ట్రంలో రూ.3,865 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర విపత్తుల విభాగం అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ఒక ప్రాథమిక నివేదికను తయారు చేసి బుధవారం కేంద్ర ప్రభుత్వానికి పంపింది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వస్తే తాత్కాలిక సాయాన్ని ప్రకటిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నివేదికను ఢిల్లీకి పంపింది. అయితే బుధవారం అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో హైదరాబాద్ నుంచి వెళ్లిన అధికారి ఏపీ భవన్‌లోని ఓ ముఖ్య అధికారికి ఈ నివేదికను అందజేసి వచ్చారు. అందులో పంట నష్టాన్ని రూ.1,420 కోట్లుగా చూపారు.