
ఎల్లమ్మ
ముత్తారం, న్యూస్‌లైన్: కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం కేశనపల్లికి చెందిన ఎల్లమ్మ(48), నర్స య్య దంపతుల పెద్దకుమారుడు రాజ్‌కుమార్ వరంగల్‌లో చదువుకునేవాడు. తెలంగాణ ఏర్పాటు లో జరుగుతున్న జాప్యానికి మనస్తాపం చెందిన రాజ్‌కుమార్ 2010 జనవరి 14న సంక్రాంతి పండుగ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉన్నత చదువులు చదివి, మంచిస్థితిలో ఉంటాడనుకున్న కొడుకు.. ఉద్యమం కోసం ఊపిరి తీసుకోవడంతో ఆ దంపతులు ఖిన్నులయ్యారు. అతని జ్ఞాపకాలను మరిచి పోలేక ఇంటి సమీపంలోనే సమాధి కట్టించుకున్నారు. నర్సయ్య విధులకు వెళ్లేవాడు. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉండే ఎల్లమ్మ.. ఎప్పుడూ కొడుకు రాజ్‌కుమార్ ఫొటోను చూస్తూ సమాధి వద్దకు వెళ్లి ఏడుస్తూ ఉండేది. కొడుకు లేకుండా బతుకుడెందుకు.. ఈ పండుగెందుకు అంటూ సమీప బంధువులతో చెబుతూ రోదించేది. వారు సర్దిచెప్పేవారు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.