ముసురు వానలే..
50 శాతం లోటు వర్షపాతం
రెండు మండలాల్లోనే సాధారణం
35 మండలాల్లో లోటు
20 మండలాల్లో అత్యల్పం
వర్షాకాలం మొదలైన నెలరోజుల తర్వాత అల్పపీడనం పుణ్యమాని ముసురు మురిపించింది. జిల్లాలో మూడు రోజులుగా చినుకులు సవ్వడి చేస్తున్నా గట్టి వర్షాలు పడకపోవడం నిరాశపర్చింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమైనప్పటికీ అంతలోనే మబ్బులు తేలిపోవడం ఆందోళనకు గురిచేసింది. తేలికపాటి వానలతో ఇప్పటికే నాటిన విత్తనాలకు ప్రాణం పోసినట్లయింది. అయితే ఆశించిన వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల అరకలు ముందుకు సాగే పరిస్థితి లేదు. ఇప్పటికీ అన్నదాతలు పూర్తిస్థాయిలో పొలం పనుల్లో నిమగ్నం కాలేదు. వరినార్లకు ఊరటనిచ్చే వర్షాల కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడంలేదు.
- కరీంనగర్ అగ్రికల్చర్
కరీంనగర్ అగ్రికల్చర్:
జిల్లావ్యాప్తంగా జూలైలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 92.2 మిల్లీమీటర్లు కాగా, 55 మిల్లీమీటర్ల మాత్రమే నమోదయింది. గతేడాది ఇదే సమయానికి 103 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూన్‌లో సాధారణ వర్షపాతం 153 మిల్లీమీటర్లకు గాను 78.7 మిల్లీమీటర్లుగా రికార్డయింది. జూన్, జూలై మాసాల్లో సాధారణ వర్షపాతం 270.8 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 136.7 మిల్లీమీటర్లే కురిసింది. జిల్లావ్యాప్తంగా సగటున 50 శాతం లోటు వర్షపాతం నమోదయింది. జిల్లాలో 57 మండలాలకు గాను 35 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. 20 మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదయింది. సారంగాపూర్, చొప్పదండి మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదయినట్టు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. సారంగాపూర్‌లో 273 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి 310.4, చొప్పదండిలో 260.1కి గాను 253.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
లోటు వర్షపాతం మండలాలు..
కమాన్‌పూర్, పెగడపల్లి. గంగాధర. హుస్నాబాద్, జూలపల్లి, మెట్‌పల్లి, భీమదేవరపల్లి, గొల్లపల్లి, జగిత్యాల, కథలాపూర్, శ్రీరాంపూర్, కోరుట్ల, కరీంనగర్, మంథని, మల్యాల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, ధర్మపురి, ఓదెల, జమ్మికుంట, వీణవంక, కోహెడ, ధర్మారం, సైదాపూర్, ముత్తారం, ఎల్కతుర్తి, కాటారం, మహాముత్తారం, రామడుగు, ఎలిగేడు, మల్హర్, బెజ్జంకి మండలాల్లో లోటు వర్షపాతం నమోదయింది.
అత్యల్ప వర్షపాతం మండలాలు..
రాయికల్, సుల్తానాబాద్, కేశవపట్నం, మేడిపల్లి, సిరిసిల్ల, రామగుండం, చందుర్తి, ఇల్లంతకుంట, తిమ్మాపూర్, ఎల్లారెడ్డిపేట, వెల్గటూర్, వేములవాడ, మహదేవపూర్, బోయినిపల్లి, చిగురుమామిడి, కొడిమ్యాల, మానకొండూర్, కోనరావుపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో అత్యల్ప వర్షపాతం రికార్డయింది.
రెండు రోజుల్లో 5.1 మిల్లీమీటర్లు..
జిల్లాలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8గంటల వరకు 40 మండలాల్లో వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సగటున 5.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా మహాముత్తారం మండలంలో 33.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మహదేవపూర్‌లో 18.4, మల్యాల 18.2, కాటారం 14.6, ముత్తారం 13.4, రాయికల్ 13, మేడిపల్లి, తిమ్మాపూర్ 12.2, కమాన్‌పూర్ 10.6, మల్హర్ 9.3, మంథని, పెద్దపల్లి 8.2, కోరుట్ల 8, కాల్వశ్రీరాంపూర్ 7.6, రామగుండంలో 7.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో మోస్తరుగా జల్లులు పడ్డాయి.