
50 ఏళ్ల మహిళపై థర్డ్ డిగ్రీ
ఒంగోలు క్రైం : ఒంగోలు మహిళా పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న పురుష పోలీసులు ఓ 50 ఏళ్ల మహిళ ను చితకబాదిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. కొడుకు, కోడలు కేసు విషయమై ఆ మహిళను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి అత్యంత పాశవికంగా కొట్టారు. వివరాలు.. ఒంగోలులోని బలరాం కాలనీ మసీదు సమీపంలో నివాసం ఉంటున్న షేక్ ఖాదర్‌బీ(50) తన కుమారుడు ఎస్‌కే రహిమాన్‌కు గతేడాది ఆగస్టులో కర్నూలు రోడ్డులోని ఎస్‌డీ మహమ్మద్ కుమార్తెనిచ్చి వివాహం చేశారు.
పెళ్లయిన నాలుగు నెలలకే కొడుకు, కోడలు మధ్య మనస్పర్థలు పొడచూపాయి. దీంతో కోడలు, కోడలు తండ్రి ఎస్‌డీ మహ్మద్ ఒంగోలులోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పైనున్న మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. మహిళా పోలీస్‌స్టేషన్ పురుష సిబ్బంది ఖాదర్‌బీతోపాటు ఆమె కుమారుడు రహిమాన్‌ను ఈ నెల 11వ తేదీన పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. భార్యభర్తల గొడవ విషయం ఏమైందో ఏమో గానీ చివరకు రహిమాన్ తల్లి ఖాదర్‌బీపై మహిళ అని కూడా చూడకుండా పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించారు.
ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఖాదర్‌బీని కొట్టారు. సాయంత్రం చీకటి పడిన తర్వాత బయటకు పంపించివేశారు. రహిమాన్‌ను మాత్రం భార్యతో అత్తగారింటికి పంపించారు. తీవ్ర గాయాలపాలైన ఖాదర్‌బీ వారం రోజులుగా మంచం పట్టింది. ఈ సంగతి తెలిసిన సమీప బంధువులు సోమవారం ఇంటికెళ్లి ఖాదర్‌బీని పరామర్శించారు. మహిళా పోలీస్‌స్టేషన్‌లోని పురుష పోలీసులు కొట్టిన విషయం అప్పుడు బయటపడింది.
శరీరమంతా వాచి, కమిలిపోవడాన్ని గమనించిన బంధువులు ఆమెను హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. ఖాదర్‌బీ అరికాళ్లపై కొట్టిన దెబ్బల వల్ల ఇప్పటికీ నడవలేకపోతోంది. నెల్లూరులో నివాసం ఉంటున్న ఖాదర్‌బీ కుటుంబం ఏడాది క్రితమే ఒంగోలులోని బలరాం కాలనీకి వచ్చింది. ప్రజలతో మమేకమై స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందికి చెబుతుంటే కొందరు మాత్రం జులుం ప్రదర్శిస్తూనే ఉన్నారు. 50 ఏళ్ల మహిళ అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా కొట్టడం ఎంత వరకు సబబని ఖాదర్‌బీ బంధువులు ప్రశ్నిస్తున్నారు.