దొంగతనం కేసులో స్టేషన్‌కు తీసుకొచ్చి చిత్రహింస
మైనర్ బాలుడినీ వదలని వైనం
అమానుష ఘటనపై విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం
షాద్‌నగర్ రూరల్: దొంగతనం కేసులో విచారిస్తామంటూ తీసుకొచ్చిన ఓ దళిత మహిళపై పోలీసులు కర్కషంగా వ్య హరించారు. అంతేకాకుండా ఆమె మైనర్ కుమారుడిపై సై తం విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా వె లుగులోకి వచ్చిన ఈ ఘటన సైబరాబాద్ పరిధిలోని రంగా రెడ్డి జిల్లా షాద్‌నగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
జూలై 24న చోరీ : షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫరూఖ్‌నగర్ ఎస్సీ కాలనీలో నివాసం ఉండే నాగేందర్ ఇంట్లో గత నెల 24న దొంగతనం జరిగింది. తన ఇంట్లో 24 తులాల బంగారంతో పాటు, రూ.2 లక్షల నగదు చోరీ జరిగిందని, దీనికి కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులే కారణమంటూ ఆయన షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తీసుకొచ్చి.. చితకబాది : కేసు విచారణలో భాగంగా పోలీసులు భీమయ్య అతని భార్య సునీతతో పాటు 13 ఏళ్ల వారి కుమారుడిని గత నెల 30న షాద్‌నగర్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. దొంగతనాన్ని ఒప్పుకోవాలని డీఐ రామిరెడ్డితోపాటు ఇతర పోలీసు సిబ్బంది తనను, భర్తను విచక్షణారహితంగా కొట్టారని సునీత ఆరోపించింది. కాగా, తల్లి ముందే మైనర్ కొడుకును సైతం పోలీసులు దారుణంగా చితకబాది వారిని అర్ధరాత్రి ఇంటికి పంపించారు.
కాగా, పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక సునీత నడవడానికి కూడా ఇబ్బందిపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను మరుసటిరోజు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. చివరకు ఈ విషయం బయటకు తెలియడంతో దళిత సంఘాల నేతలు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సాయంతో ఆదివారం సునీతను షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
విచారణకు ఆదేశం : దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పం కావడం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ జోక్యం చేసుకోవడంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పరామర్శ : దళిత మహిళపై పోలీసులు చేసిన దాడి విషయాన్ని తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంలు షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి బాధితురాలు సునీతను పరామర్శించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ.. మహిళ అని చూడకుండా పోలీసులు సునీతను కొట్టడం సరికాదని అన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు న్యాయం చేయాలన్నారు.
సైబరాబాద్ కార్యాలయానికి అటాచ్ : దొంగతనం కేసులో దళిత మహిళ, మైనర్ బాలుడిని షాద్‌నగర్ పోలీసులు చితకబాదిన ఘటనపై ఆదివారం సాయంత్రం సైబరాబాద్ సీపీ మహంతి స్పందించారు. షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (డీఐ) రామిరెడ్డిని సైబరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేశారు.
షాద్‌నగర్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్
సమగ్ర విచారణకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: బంగారం చోరీ కేసులో ఓ దళిత మహిళ, ఆమె భర్తపై షాద్‌నగర్ పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలకు గురి చేసిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు.
ఘటనతో సంబంధం ఉందని భావించిన వారిని వెంటనే అక్కడి నుంచి తప్పించి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయాలని ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారు ఎవరూ తప్పించుకోలేరని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. బాధితులకు న్యాయం చేయడంతోపాటు వారికి అండగా ఉంటామని హామీఇచ్చారు.
దళిత మహిళపై దౌర్జన్యం హేయమైన చర్య: మాజీ మంత్రి హరీశ్‌రావు
దళిత మహిళపట్ల పోలీసులు కర్కషంగా వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకోవాలని దళిత దంపతులను చిత్రహింసలకు గురిచేయడం మానవ హక్కుల ఉల్లంఘనకు నిదర్శనమన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment