గిద్దలూరు: కసి, పట్టుదల.. ఆ ఊరి విద్యార్థులనుఉన్నత శిఖరాలకు చేరుస్తున్నాయి. స్కూల్లో ఓ విద్యార్థికి మంచి మార్కులు వస్తే ‘మాకెందుకు రావు’ అనే కసి..ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించాడని తెలియగానే‘మేమెందుకు సాధించలేం’ అనే కసి ఆ ఊరి ముఖచిత్రాన్ని మార్చేశాయి. చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరాలకు బాటలు వేసుకుంటున్నవారు కొందరైతే.. చదవలేనివారు చిరుద్యోగమైనా చేయాలన్న సంకల్పంతో ముందుడుగు వేస్తున్నారు. ఊరిలో ఏ వీధి చూసినా అందమైన ఇళ్లు కనిపిస్తాయి. కానీ అందులో జనాలుండరు. కారణమేంటంటే ఆ ఇళ్లలో వారంతా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు
చేస్తున్నారు. పండగలు, శుభకార్యాలకు మాత్రమే గ్రామానికి వచ్చి వెళ్తుంటారు. 300 కుటుంబాలు ఉన్న ఆ గ్రామంలో ఉద్యోగం లేని కుటుంబాలు 30 మాత్రమే ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. కొమరోలు పంచాయతీ పరిధిలో కొలువుల ఖిల్లాగా పేరుగాంచిన గోపాలునిపల్లె గ్రామవిశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
ఉద్యోగాలకు మూలాలివీ..
గోపాలునిపల్లెలో ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించేందుకు తగిన విద్యా సౌకర్యాలు ఉండటమే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. బ్రిటిష్ పాలనలోనే గోపాలునిపల్లెకు అర కిలోమీటరు దూరం ఉన్న కొమరోలు మండల కేంద్రంలో ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఉండేది. ఎక్కువ మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్న ఉద్దేశంతో ఈ పాఠశాలను 8వ తరగతి(మిడిల్ స్కూల్) వరకు అప్‌గ్రేడ్ చేశారు. 8వ తరగతి వరకు చదువుకున్న వారు కొమరోలుకు 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేస్తవారిపేటలో ఫారినర్స్ నెలకొల్పిన పాఠశాలలో బేసిక్ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేశారు. ఇక్కడ రెండేళ్లపాటు ఉచితంగా చదువుకున్న వారికి ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు ఇచ్చారు. అప్పట్లో 20 మంది వరకు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. అప్పట్లో వీరికి ప్రభుత్వం నెలకు 30 రూపాయలు వేతనం ఇచ్చేది. 1955లో వీరి పిల్లలు హైయర్ స్కూల్లో 10వ తరగతి చదువుకున్న తర్వాత బెంగళూరులో సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ కోర్సు చేశారు. వీరికి ఆ వెంటనే ఉద్యోగాలు వచ్చాయి. ఇలా ఒక తరం తర్వాత మరో తరం ఉద్యోగాలు సాధిస్తూ వస్తున్నారు.
అభివృద్ధిలోనూ ముందంజ
గ్రామంలోని అన్ని వీధుల్లో సిమెంటు రోడ్లే దర్శనమిస్తాయి. ప్రధాన వీధుల్లో మురుగు కాలువలు నిర్మించారు. పాఠశాల, అంగన్‌వాడీ స్కూల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామంలో పశువుల పాకలు మినహా ఒక్క పూరిల్లు కనిపించదు. రెండతస్తులు, ఒక అంతస్తు భవనాలు ఎక్కువగానే ఉన్నాయి. పురాతన వేణుగోపాలస్వామి ఆలయం, రామాలయంతో పాటు, రెండు చర్చిలు, మసీదు, శివాలయం ఉన్న ఈ గ్రామంలో రోడ్డుకిరువైపులా చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. సంక్రాంతి పండుగ వస్తే గ్రామంలోని ఉద్యోగులందరూ గ్రామానికి చేరుకుంటారు. దీంతో గ్రామం మొత్తం సందడిగా ఉంటుంది. ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య మినహా మిగిలిన సమస్యలేవీ ఈ ఊరిలో లేవు
300 కుటుంబాలు 510ఉద్యోగులు
గ్రామంలో మూడు వందల కుటుంబాలు ఉన్నాయి. 950 మంది జనాభా కాగా వీరిలో 510 మంది ఉద్యోగులు ఉన్నారు. చదువులో బాగా రాణించిన వారు ఉపాధ్యాయులుగా, ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డీఎస్పీలు, సచివాలయ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియెట్ చదువుకున్న వారు ఆర్మీ జవాన్లుగా, పోలీసులుగా ఉద్యాగాలు సాధించారు. మరికొందరు ప్రైవేట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. గ్రామంలో 10 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు, భవనాల నిర్మాణ కాంట్రాక్టర్లుగా రాణిస్తున్నారు. మండలస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పగల నాయకులకు గ్రామంలో కొదవలేదు. ఓ కుటుంబంలో ఏకంగా ఎనిమిది మంది ఉపాధ్యాయులుగా ఉన్నారు. గ్రామానికి చెందిన నక్కా వెంకటరమణ, రాధాకృష్ణ, రాధామోహన్, వేణుగోపాల్ సోదరులు కాగా వీరిలో ముగ్గురి భార్యలు ఉపాధ్యాయులు కావడం విశేషం. వీరి పిల్లలు మరో ఐదుగురు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా గ్రామంలో ఐదారు కుటుంబాల్లో నలుగురు చొప్పున ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. 100 గృహాలకు పైగా ఇద్దరు చొప్పున ఉద్యోగాలు చేస్తున్నారు. 10 మంది యువకులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా విదేశాల్లో స్థిరపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ గ్రామానికి చెందిన వారు ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. గ్రామంలో ఉద్యోగాలు లేని 30 కుటుంబాల వారు వ్యవసాయం, కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. గ్రామానికి చెందిన ముగ్గురు విద్యావేత్తలు ఎయిడెడ్ విద్యాసంస్థలను నెలకొల్పి మండలంలోని పలు గ్రామాల విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు.
మా కుటుంబంలోనే ఎనిమిది మంది ఉపాధ్యాయులం
మా గ్రామం మేధావులకు పుట్టినిల్లుగా చెప్పుకుంటుంటారు. గ్రామంలో 70 మందికి పైగా ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, డీఎస్పీలు లాంటి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. మేము ఐదుమంది అన్నదమ్ములం. అందరం ఉపాధ్యాయులమే. మా సోదరుల భార్యలు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. మా పిల్లలు ఐదుగురు ఇతర ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో 500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వసతుల కల్పన, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం వల్ల ఇంత మంది ఉద్యోగం సంపాదించగలిగారు. – నక్కా వెంకటరమణ, రిటైర్డ్ టీచర్, గోపాలునిపల్లె గ్రామం
Comments
Please login to add a commentAdd a comment