govenment employees
-
స్పీకర్ పక్కనుండగానే నిద్ర పోతున్నాడు ఈ ఆఫీసర్
-
జగన్ పీఆర్సీ నిర్ణయంతో ఉద్యోగుల పాలాభిషేకం
-
కొలువుల ఖిల్లా గోపాలునిపల్లె
గిద్దలూరు: కసి, పట్టుదల.. ఆ ఊరి విద్యార్థులనుఉన్నత శిఖరాలకు చేరుస్తున్నాయి. స్కూల్లో ఓ విద్యార్థికి మంచి మార్కులు వస్తే ‘మాకెందుకు రావు’ అనే కసి..ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించాడని తెలియగానే‘మేమెందుకు సాధించలేం’ అనే కసి ఆ ఊరి ముఖచిత్రాన్ని మార్చేశాయి. చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరాలకు బాటలు వేసుకుంటున్నవారు కొందరైతే.. చదవలేనివారు చిరుద్యోగమైనా చేయాలన్న సంకల్పంతో ముందుడుగు వేస్తున్నారు. ఊరిలో ఏ వీధి చూసినా అందమైన ఇళ్లు కనిపిస్తాయి. కానీ అందులో జనాలుండరు. కారణమేంటంటే ఆ ఇళ్లలో వారంతా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పండగలు, శుభకార్యాలకు మాత్రమే గ్రామానికి వచ్చి వెళ్తుంటారు. 300 కుటుంబాలు ఉన్న ఆ గ్రామంలో ఉద్యోగం లేని కుటుంబాలు 30 మాత్రమే ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. కొమరోలు పంచాయతీ పరిధిలో కొలువుల ఖిల్లాగా పేరుగాంచిన గోపాలునిపల్లె గ్రామవిశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఉద్యోగాలకు మూలాలివీ.. గోపాలునిపల్లెలో ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించేందుకు తగిన విద్యా సౌకర్యాలు ఉండటమే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. బ్రిటిష్ పాలనలోనే గోపాలునిపల్లెకు అర కిలోమీటరు దూరం ఉన్న కొమరోలు మండల కేంద్రంలో ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఉండేది. ఎక్కువ మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్న ఉద్దేశంతో ఈ పాఠశాలను 8వ తరగతి(మిడిల్ స్కూల్) వరకు అప్‌గ్రేడ్ చేశారు. 8వ తరగతి వరకు చదువుకున్న వారు కొమరోలుకు 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేస్తవారిపేటలో ఫారినర్స్ నెలకొల్పిన పాఠశాలలో బేసిక్ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేశారు. ఇక్కడ రెండేళ్లపాటు ఉచితంగా చదువుకున్న వారికి ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు ఇచ్చారు. అప్పట్లో 20 మంది వరకు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. అప్పట్లో వీరికి ప్రభుత్వం నెలకు 30 రూపాయలు వేతనం ఇచ్చేది. 1955లో వీరి పిల్లలు హైయర్ స్కూల్లో 10వ తరగతి చదువుకున్న తర్వాత బెంగళూరులో సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ కోర్సు చేశారు. వీరికి ఆ వెంటనే ఉద్యోగాలు వచ్చాయి. ఇలా ఒక తరం తర్వాత మరో తరం ఉద్యోగాలు సాధిస్తూ వస్తున్నారు. అభివృద్ధిలోనూ ముందంజ గ్రామంలోని అన్ని వీధుల్లో సిమెంటు రోడ్లే దర్శనమిస్తాయి. ప్రధాన వీధుల్లో మురుగు కాలువలు నిర్మించారు. పాఠశాల, అంగన్వాడీ స్కూల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామంలో పశువుల పాకలు మినహా ఒక్క పూరిల్లు కనిపించదు. రెండతస్తులు, ఒక అంతస్తు భవనాలు ఎక్కువగానే ఉన్నాయి. పురాతన వేణుగోపాలస్వామి ఆలయం, రామాలయంతో పాటు, రెండు చర్చిలు, మసీదు, శివాలయం ఉన్న ఈ గ్రామంలో రోడ్డుకిరువైపులా చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. సంక్రాంతి పండుగ వస్తే గ్రామంలోని ఉద్యోగులందరూ గ్రామానికి చేరుకుంటారు. దీంతో గ్రామం మొత్తం సందడిగా ఉంటుంది. ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య మినహా మిగిలిన సమస్యలేవీ ఈ ఊరిలో లేవు 300 కుటుంబాలు 510ఉద్యోగులు గ్రామంలో మూడు వందల కుటుంబాలు ఉన్నాయి. 950 మంది జనాభా కాగా వీరిలో 510 మంది ఉద్యోగులు ఉన్నారు. చదువులో బాగా రాణించిన వారు ఉపాధ్యాయులుగా, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డీఎస్పీలు, సచివాలయ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియెట్ చదువుకున్న వారు ఆర్మీ జవాన్లుగా, పోలీసులుగా ఉద్యాగాలు సాధించారు. మరికొందరు ప్రైవేట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. గ్రామంలో 10 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు, భవనాల నిర్మాణ కాంట్రాక్టర్లుగా రాణిస్తున్నారు. మండలస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పగల నాయకులకు గ్రామంలో కొదవలేదు. ఓ కుటుంబంలో ఏకంగా ఎనిమిది మంది ఉపాధ్యాయులుగా ఉన్నారు. గ్రామానికి చెందిన నక్కా వెంకటరమణ, రాధాకృష్ణ, రాధామోహన్, వేణుగోపాల్ సోదరులు కాగా వీరిలో ముగ్గురి భార్యలు ఉపాధ్యాయులు కావడం విశేషం. వీరి పిల్లలు మరో ఐదుగురు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా గ్రామంలో ఐదారు కుటుంబాల్లో నలుగురు చొప్పున ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. 100 గృహాలకు పైగా ఇద్దరు చొప్పున ఉద్యోగాలు చేస్తున్నారు. 10 మంది యువకులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా విదేశాల్లో స్థిరపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ గ్రామానికి చెందిన వారు ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. గ్రామంలో ఉద్యోగాలు లేని 30 కుటుంబాల వారు వ్యవసాయం, కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. గ్రామానికి చెందిన ముగ్గురు విద్యావేత్తలు ఎయిడెడ్ విద్యాసంస్థలను నెలకొల్పి మండలంలోని పలు గ్రామాల విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు. మా కుటుంబంలోనే ఎనిమిది మంది ఉపాధ్యాయులం మా గ్రామం మేధావులకు పుట్టినిల్లుగా చెప్పుకుంటుంటారు. గ్రామంలో 70 మందికి పైగా ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, డీఎస్పీలు లాంటి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. మేము ఐదుమంది అన్నదమ్ములం. అందరం ఉపాధ్యాయులమే. మా సోదరుల భార్యలు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. మా పిల్లలు ఐదుగురు ఇతర ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో 500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వసతుల కల్పన, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం వల్ల ఇంత మంది ఉద్యోగం సంపాదించగలిగారు. – నక్కా వెంకటరమణ, రిటైర్డ్ టీచర్, గోపాలునిపల్లె గ్రామం -
అధికారానికి అడుగు దూరం
సాక్షి, చీరాల(ప్రకాశం): అధికారులు కొందరు చేసే ఇష్టారాజ్య పనులు ఇకపై సాగవు. అధికార పార్టీలతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు సైతం అనుకూలంగా వ్యవహరిస్తే వేటు తప్పని పరిస్థితి. ఎన్నికల నియమావళిలోనే అధికారులు, సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో సాధారణ ప్రజల మాదిరిగా ఉద్యోగులు వ్యాఖ్యలు చేసినా చర్యలు తప్పని పరిస్థితి. చీరాల నియోజకవర్గంలో కొందరు అధికారుల తీరుపైనే ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా ముఖ్య నాయకులు చీరాల ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో పాటు పలు అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని మార్చేశారు. ఎన్నికల కోడ్‌కు ముందు టీడీపీ ప్రభుత్వం నియమించుకున్న అధికారులు ఎన్నికల కోడ్ పరిధిలో పనిచేయకుండా అధికార పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యల్లో భాగస్వాములు అవుతారు. ప్రచారాలపై మక్కువ ఉంటే అంతే.. సామాన్యుల్లాగా ప్రభుత్వ ఉద్యోగులు వారి అభిప్రాయాలను ప్రచారం చేయకూడదు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచారం లోగానీ, సామాజిక మాధ్యమాల్లో గాని సొంత అభిప్రాయాలను పోస్టు చేయడం, చర్చలు పెట్టడం ఎన్నికల నియామావళికి విరుద్ధం. వార్డు సభ్యుడి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ మంత్రుల వెంట అధికారులు, సిబ్బంది ప్రచారాలకు వెళ్లడం, వారితో తిరగడం ఇక వీలుకాదు. ఒకవేళ ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు ఎటువంటి పార్టీలకు సహకరించకూడదు. ఈ విషయంలో ఏవైనా ఫిర్యాదులు, ఫొటోలు, వీడియోలు వస్తే వారి ఉద్యోగులు పోగొట్టుకోవడంతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఎన్నికల నియమావళిని అనుసరించి ఉద్యోగులు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. -
బెదిరింపులు... దాడులు..!
సాక్షి, విజయనగరం: జిల్లాలో ఉద్యోగులు హడలిపోతున్నారు. ఇన్నాళ్లు నాలుగు గోడల మధ్య అధికారులను ఇష్టానుసారం మాట్లాడిన అధికారపార్టీ నాయకులు ఇప్పుడు బహిరంగంగా దూషణలకు దిగుతున్నారు. మరోవైపు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అది చాలదన్నట్లు దాడుల వరకు వచ్చేశారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఇలాగైతే ఉద్యోగాలు కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందునా గజపతినగరం నియోజకవర్గ నాయకులంటేనే హడలిపోయే పరిస్థితి తలెత్తింది. ‘ఏమనుకుంటున్నావ్ నువ్వు... బయటకు రా నీ కథ తేలుస్తాను... తమాషా చేస్తున్నావా?...’ ఇదీ గతేడాది చివరిరోజున జరిగిన జెడ్పీ సమావేశంలో అధికారపార్టీకి చెందిన గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు, జెడ్పీటీసీలు పలువురు పార్వతీపురం పంచాయతీరాజ్ ఈఈ వి.ఎస్.ఎన్.మూర్తిపై దూషణలు, బెదిరింపులు. ఈ ఘటన మరవకుండానే జన్మభూమి గ్రామసభ సాక్షిగా అనేక మంది చూస్తుండగానే గజపతినగరంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు, సర్పంచ్, వారి కుటుంబసభ్యులు వెలుగు ఏపీఎంపై భౌతిక దాడికి పాల్పడ్డారు. అంతేకాదు పరుగులు పెట్టించి కొట్టారు. ఈ ఘటనతో ఉద్యోగుల్లో అత్మస్థైర్యం సన్నగిల్లింది. ఆందోళన పెరిగింది. ఈ సంఘటనలతో ఉద్యోగులంటే తెలుగుదేశం నాయకులకు చులకనగా మారిందని, అధికారం ఉందని విర్రవీగి ఏదైనా చేస్తారన్న భయం పలువురు ఉద్యోగుల్లో పెరిగిపోయింది. ఇలాగైతే ఉద్యోగాలు చేయడం కష్టమని వాపోతున్నారు. తెలుగుదేశం నాయకులు ఇలా వ్యవహరించడానికి కారణం వారి అడుగులకు మడుగులొత్తడమేనన్న భావన వ్యక్తం అవుతోంది. కొంత మంది అధికారులు తెలుగుదేశం నాయకులకు జీ హుజూర్ అనడంతో వారు ఇష్టానుసారం చేస్తున్నారన్న అభిప్రాయం ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. పైగా రాజకీయ సిఫార్సులకు తలొగ్గి ఉద్యోగులను ఎప్పటికప్పుడు బదిలీలు చేస్తుండడంతో ఉద్యోగులను తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకుని వారి మనుగడను దెబ్బతీస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలాఉంటే ఉద్యోగులంటే చులకనగా మారడానికి మరో కారణం ఉద్యోగుల్లో ఐక్యత లేకపోవడం. పేరుకు ఉద్యోగ సంఘాలున్నా ఒక ఉద్యోగికి అన్యాయం జరిగితే పోరాడే పరిస్థితి ఇప్పుడు జిల్లాలో లేదు. ఒకప్పుడు ఉద్యోగులపై అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే ఉద్యోగసంఘాలన్నీ ఒకటై ఆందోళన నిర్వహించిన సందర్భాలున్నాయి. తద్వారా అధికారంలో ఉన్నా ప్రభుత్వం మెడలు వంచేవారు. ఇప్పుడు ఐక్యత లోపించడంవల్లే ఉద్యోగులంటే గౌరవం, భయం పోతోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న జెడ్పీలో అధికారులను ఇష్టానుసారం మాట్లాడిన నేతలపై ఉద్యోగ సంఘాలు సమష్టిగా పోరాడ లేకపోయాయి. వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేయలేకపోయినా ముక్తకంఠంతో ఖండించలేకపోయాయి. గజపతినగరంలో ఏపీఎంపై దాడి చేసినా సంఘాలు పెద్దగా స్పందించ లేదు. ఇందుకు కూడా ఉన్నతాధికారుల వైఖరి కారణమవుతోంది. సంఘాలు గట్టిగా మాట్లాడితే ఎక్కడ తమకు అడ్డుతగులుతారని ఉన్నతశ్రేణిలో ఉన్న అధికారులు సంఘాలకు నేతృత్వం వహించే వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా ఉద్యోగులకు భద్రత కరవవుతోంది. ఈ నేపధ్యంలోనైనా మేల్కోని ఉద్యోగ సంఘాలు ఒక్కటి కావాలని, అధికారులు వారికి కొంత స్వేచ్ఛ ఇవ్వాలని కోరుతున్నారు. నాయకుల అడుగులకు మడుగులొత్తినందుకే...సంఘాల్లో పటుత్వం తగ్గిందా? -
ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుల రద్దు
- భారీ వర్షం హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ నిర్ణయం ఒంగోలు: రుతుపవనాల ప్రభావం కారణంగా జిల్లాలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ వి.వినయ్‌చంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కోస్తా తీర ప్రాంత అధికారులతో పాటు అన్ని మండల స్థాయి అధికారులు మండల కేంద్రాల్లో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాజ్‌వేలు, లో లెవల్ బ్రిడ్జిల వద్ద పరిస్థితులను గమనించి ప్రయాణాలు కొనసాగించాలని సూచించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు, సాయం పొందేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ 1077 లేదా ల్యాండ్ లైన్ నంబర్ 08592 – 281400కు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు.