సాక్షి, విజయనగరం: జిల్లాలో ఉద్యోగులు హడలిపోతున్నారు. ఇన్నాళ్లు నాలుగు గోడల మధ్య అధికారులను ఇష్టానుసారం మాట్లాడిన అధికారపార్టీ నాయకులు ఇప్పుడు బహిరంగంగా దూషణలకు దిగుతున్నారు. మరోవైపు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అది చాలదన్నట్లు దాడుల వరకు వచ్చేశారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఇలాగైతే ఉద్యోగాలు కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందునా గజపతినగరం నియోజకవర్గ నాయకులంటేనే హడలిపోయే పరిస్థితి తలెత్తింది.
‘ఏమనుకుంటున్నావ్ నువ్వు... బయటకు రా నీ కథ తేలుస్తాను... తమాషా చేస్తున్నావా?...’ ఇదీ గతేడాది చివరిరోజున జరిగిన జెడ్పీ సమావేశంలో అధికారపార్టీకి చెందిన గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు, జెడ్పీటీసీలు పలువురు పార్వతీపురం పంచాయతీరాజ్ ఈఈ వి.ఎస్.ఎన్.మూర్తిపై దూషణలు, బెదిరింపులు. ఈ ఘటన మరవకుండానే జన్మభూమి గ్రామసభ సాక్షిగా అనేక మంది
చూస్తుండగానే గజపతినగరంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు, సర్పంచ్, వారి కుటుంబసభ్యులు వెలుగు ఏపీఎంపై భౌతిక దాడికి పాల్పడ్డారు. అంతేకాదు పరుగులు పెట్టించి కొట్టారు. ఈ ఘటనతో ఉద్యోగుల్లో అత్మస్థైర్యం సన్నగిల్లింది. ఆందోళన పెరిగింది. ఈ సంఘటనలతో ఉద్యోగులంటే తెలుగుదేశం నాయకులకు చులకనగా మారిందని, అధికారం ఉందని విర్రవీగి ఏదైనా చేస్తారన్న భయం పలువురు ఉద్యోగుల్లో పెరిగిపోయింది. ఇలాగైతే ఉద్యోగాలు చేయడం కష్టమని వాపోతున్నారు.
తెలుగుదేశం నాయకులు ఇలా వ్యవహరించడానికి కారణం వారి అడుగులకు మడుగులొత్తడమేనన్న భావన వ్యక్తం అవుతోంది. కొంత మంది అధికారులు తెలుగుదేశం నాయకులకు జీ హుజూర్ అనడంతో వారు ఇష్టానుసారం చేస్తున్నారన్న అభిప్రాయం ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. పైగా రాజకీయ సిఫార్సులకు తలొగ్గి ఉద్యోగులను ఎప్పటికప్పుడు బదిలీలు చేస్తుండడంతో ఉద్యోగులను తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకుని వారి మనుగడను దెబ్బతీస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలాఉంటే ఉద్యోగులంటే చులకనగా మారడానికి మరో కారణం ఉద్యోగుల్లో ఐక్యత లేకపోవడం. పేరుకు ఉద్యోగ సంఘాలున్నా ఒక ఉద్యోగికి అన్యాయం జరిగితే పోరాడే పరిస్థితి ఇప్పుడు జిల్లాలో లేదు. ఒకప్పుడు ఉద్యోగులపై అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే ఉద్యోగసంఘాలన్నీ ఒకటై ఆందోళన నిర్వహించిన సందర్భాలున్నాయి. తద్వారా అధికారంలో ఉన్నా ప్రభుత్వం మెడలు వంచేవారు. ఇప్పుడు ఐక్యత లోపించడంవల్లే ఉద్యోగులంటే గౌరవం, భయం పోతోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న జెడ్పీలో అధికారులను ఇష్టానుసారం మాట్లాడిన నేతలపై ఉద్యోగ సంఘాలు సమష్టిగా పోరాడ లేకపోయాయి.
వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేయలేకపోయినా ముక్తకంఠంతో ఖండించలేకపోయాయి. గజపతినగరంలో ఏపీఎంపై దాడి చేసినా సంఘాలు పెద్దగా స్పందించ లేదు. ఇందుకు కూడా ఉన్నతాధికారుల వైఖరి కారణమవుతోంది. సంఘాలు గట్టిగా మాట్లాడితే ఎక్కడ తమకు అడ్డుతగులుతారని ఉన్నతశ్రేణిలో ఉన్న అధికారులు సంఘాలకు నేతృత్వం వహించే వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా ఉద్యోగులకు భద్రత కరవవుతోంది. ఈ నేపధ్యంలోనైనా మేల్కోని ఉద్యోగ సంఘాలు ఒక్కటి కావాలని, అధికారులు వారికి కొంత స్వేచ్ఛ ఇవ్వాలని కోరుతున్నారు. నాయకుల అడుగులకు మడుగులొత్తినందుకే...సంఘాల్లో పటుత్వం తగ్గిందా?
Comments
Please login to add a commentAdd a comment