సాక్షి, చీరాల(ప్రకాశం): అధికారులు కొందరు చేసే ఇష్టారాజ్య పనులు ఇకపై సాగవు. అధికార పార్టీలతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు సైతం అనుకూలంగా వ్యవహరిస్తే వేటు తప్పని పరిస్థితి. ఎన్నికల నియమావళిలోనే అధికారులు, సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో సాధారణ ప్రజల మాదిరిగా ఉద్యోగులు వ్యాఖ్యలు చేసినా చర్యలు తప్పని పరిస్థితి. చీరాల నియోజకవర్గంలో కొందరు అధికారుల తీరుపైనే ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా ముఖ్య నాయకులు చీరాల ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో పాటు పలు అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని మార్చేశారు. ఎన్నికల కోడ్‌కు ముందు టీడీపీ ప్రభుత్వం నియమించుకున్న అధికారులు ఎన్నికల కోడ్ పరిధిలో పనిచేయకుండా అధికార పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యల్లో భాగస్వాములు అవుతారు.
ప్రచారాలపై మక్కువ ఉంటే అంతే..
సామాన్యుల్లాగా ప్రభుత్వ ఉద్యోగులు వారి అభిప్రాయాలను ప్రచారం చేయకూడదు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచారం లోగానీ, సామాజిక మాధ్యమాల్లో గాని సొంత అభిప్రాయాలను పోస్టు చేయడం, చర్చలు పెట్టడం ఎన్నికల నియామావళికి విరుద్ధం. వార్డు సభ్యుడి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ మంత్రుల వెంట అధికారులు, సిబ్బంది ప్రచారాలకు వెళ్లడం, వారితో తిరగడం ఇక వీలుకాదు. ఒకవేళ ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు ఎటువంటి పార్టీలకు సహకరించకూడదు. ఈ విషయంలో ఏవైనా ఫిర్యాదులు, ఫొటోలు, వీడియోలు వస్తే వారి ఉద్యోగులు పోగొట్టుకోవడంతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఎన్నికల నియమావళిని అనుసరించి ఉద్యోగులు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment