సాక్షి, అమలాపురం టౌన్: సోషల్ మీడియా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న క్రమంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారత ఎన్నికల సంఘం అంతే తీవ్రస్థాయిలో నిఘా పెట్టింది. దీంతో జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీసులు కూడా అదే దృష్టిలో కన్ను వేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ మీడియా ఇంతటి ప్రాధాన్యతను... విప్లవాత్మకతను సంతరించుకోలేదు. ఈసారి ఎన్నికల్లో సోషల్ మీడియాను వేదిక చేసుకుని రాజకీయ పార్టీల అభ్యర్థులు, నాయకులు పరోక్ష ప్రచారం చేసుకునేందుకు ఉన్న వెసులుబాటుపై ఎలక్షన్ కమిషన్ (ఈసీ) వేటు వేసేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియా తమ రాజకీయ పార్టీలకు అనుకూలంగా...పార్టీ అభ్యర్థులకు సానుకూలంగా పోస్టులు పెడితేనే కాదు... ప్రత్యర్ధి పార్టీలు, ముఖ్యనేతలు, అభ్యర్థులపై అసభ్యకరంగా, వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెట్టినా శిక్షార్హులేనని ఈసీ హెచ్చరిస్తోంది.
ఈ రోజు నూటికి 90 మంది చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉండి సోషల్ మీడియా పోస్లింగులు వైరల్‌లా వ్యాపిస్తున్నాయి. ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు, యూట్యూబ్, ట్విట్టర్లు, సాధారణ మెసేజ్‌ల పేరుతో సోషల్ మీడియాలో అనేక రాజకీయ వ్యంగ్య చిత్రాలు, దృశ్యాలే కాకుండా ఏదైనా ఓ పార్టీ నేతను అండబ్రహ్మాండ నేతగా పోల్చుతూ సినిమా పాటలను తలదన్నేలా పాటలు, వీడియోల ద్వారా విస్త్రృత ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రచారాలకు ఈసీ చెక్ పెడుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో ఏదైనా రాజకీయ పోస్టింగ్ అనుకూలం, ప్రతికూలం ఏదైనా ఈసీకి అడ్డంగా బుక్కైపోతారు. వాట్సాప్‌లు, యూ ట్యూబ్‌లో అయితే వార్నింగులు, యూ టర్న్‌లు లేకుండా ఆ స్మార్ట్ ఫోన్‌లోని వ్యక్తి పేరు, నెంబర్ ఆధారంగా చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
పత్రికలు, టీవీల్లో ఎన్నికల ప్రచార ప్రకటన మాదిరిగానే సోషల్ మీడియా వచ్చే ప్రచార ప్రకటనలకు ఈసీ లెక్కలు కట్టి ఖర్చులు రాసేస్తుంది. అభ్యంతరకర పోస్టింగులపై సైబర్ క్రైమ్ కింద చర్యలు చేపట్టేందుకు ఈసీ అక్కడికక్కడే పోలీసులను ఆదేశించే సర్వాధికారం ఉంటుంది. కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాజకీయ, ప్రజాప్రతినిధులపై ప్రేమతో... అత్యుత్సాహంతో ఫలానా పార్టీకి..ఫలానా అభ్యర్థికి అనుకూలంగా తమ వ్యక్తిగత స్మార్ట్ ఫోన్ నుంచి పోస్టింగ్‌లు పెడుతున్న వైనంపై కూడా ఈసీ సీరియస్‌గా దృష్టి పెట్టింది. నెటిజన్లూ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లున్న వారు ఈ ఎన్నికల ప్రక్రియ సాగే దాదాపు 70 రోజులపాటు బహు పరాక్‌గా... జర జాగ్రత్తగా ఉంటేనే మంచిది. లేకుంటే సోషల్ మీడియా ప్రచారం వల్ల రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఖర్చులు, లెక్కల పరంగా బొప్పి కట్టడమే కాకుండా అభ్యంతర పోస్టులకు సైబర్ క్రైమ్ కింద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
కొత్తగా వచ్చిన ఓ పార్టీ ఇటీవల కాలంలో పూర్తిగా సోషల్ మీడియానే నమ్ముకుని ఆ మీడియానే వేదిక చేసుకుని తెగ ప్రచారం చేసుకుంటోంది. అలాంటి పార్టీలకు..అలాంటి పార్టీల నాయకులకు ఆ మీడియాపై ఈసీ విధించిన నిబంధనల వలలో చిక్కక తప్పుదు. అందుకే ఈసీ సోషల్ మీడియాపై విధించిన ఆంక్షలు చూసి జిల్లాలో కొందరు తమ తమ స్మార్ట్ ఫోన్ల నుంచి ఎలాంటి రాజకీయ పోస్టులు పెట్టవద్దని ముందే అభ్యర్థించడం నాలుగు రోజుల ముందు నుంచే మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment