డీవీడీలలో బంగారం
వైజాగ్: విశాఖ విమానాశ్రయంలో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో దాచి ఉంచి అక్రమంగా తరలిస్తుండగా పోలీసుల కంటపడింది. దాదాపు వందమంది ప్రయాణికులు అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు వీరిని ప్రశ్నించినపుడు ఈ విషయం బయటపడింది. డీవీడీ ప్లేయర్లు, మైక్రోవేవ్ అవెన్లలో దాచి ఉంచిన 55 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం కౌలాలంపూర్, సింగపూర్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్లో దిగిన వీరంతా తమిళనాడుకు చెందిన వారుగా తెలుస్తోంది. మొత్తం 18 మంది వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ నెలలో బంగారం పట్టుబడటం ఇది మూడోసారి. ఇంతకుముందు ఒకసారి 12 కిలోల బంగారం పట్టుబడింది. ఇప్పుడు మరింత ఎక్కువగా.. ఏకంగా 55 కిలోలు పట్టుబడింది. ఇటీవలి కాలంలో శంషాబాద్ విమానాశ్రయంలో భారీ మొత్తంలో పట్టుబడుతుండటంతో స్మగ్లర్లు విశాఖవైపు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఎయిర్ కనెక్టివిటీ పెరగడంతో మలేషియా, దుబాయ్ వైపు వెళ్లే విమానాల ద్వారానే ఈ అక్రమ రవాణా సాగుతోందని సమాచారం.