గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయే గడ్డి పరకలు కూడా ఒక్కటిగా కలిస్తే మదపుటేనుగునైనా బంధించగలవ ని, బలహీనమైన చలి చీమలు బలవంతమైన సర్పాన్ని అంతమొందిస్తాయన్న స్ఫూర్తితో సమైక్యవాదులు ఐకమత్యంతో కదం తొక్కుతున్నారు.
సాక్షి, అనంతపురం : గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయే గడ్డి పరకలు కూడా ఒక్కటిగా కలిస్తే మదపుటేనుగునైనా బంధించగలవ ని, బలహీనమైన చలి చీమలు బలవంతమైన సర్పాన్ని అంతమొందిస్తాయన్న స్ఫూర్తితో సమైక్యవాదులు ఐకమత్యంతో కదం తొక్కుతున్నారు. చేయి చేయి కలిపి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఫలితంగా 50వ రోజైన బుధవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం జోరుగా కొనసాగింది. అనంతపురం నగరంలో సమైక్య నినాదాలు హోరెత్తాయి. రాష్ట్ర విభజన జరిగితే తమ బతుకులు బుగ్గిపాలవుతాయంటూ జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సప్తగిరి సర్కిల్‌లో మానవహారం నిర్మించారు. వ్యవసాయాధికారులు జోలె పట్టి భిక్షాటన చేశారు. రైతుమిత్ర, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు.
నీటి పారుదల, పీఏసీఎస్, పంచాయతీ రాజ్, పశుసంవర్ధక, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ జేఏసీలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విన్సెంట్ డీపాల్, ఎస్‌వీఐటీ, రైపర్, రాధాస్కూల్ ఆఫ్ లెర్నింగ్ విద్యార్థులు ర్యాలీగా ఎస్కేయూ వద్దకు చేరుకుని... వర్సిటీ విద్యార్థులతో కలసి జాతీయ రహదారిపై బైఠాయించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలకు రహదారిపై సమాధులు కట్టి.. పిండ ప్రదానం చేశారు. వర్సిటీ ఎదుట విద్యార్థులు, ధర్మవరంలో జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇదే పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో రైతు గర్జన నిర్వహించారు.
ముదిగుబ్బ, బత్తలపల్లిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ముదిగుబ్బలో మహిళలు జాతీయ రహదారిపై ముగ్గులు వేసి సమైక్య నినాదాన్ని చాటారు. గుంతకల్లులో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. జేఏసీ నాయకులు దున్నపోతులకు సోనియా, చిరంజీవి ఫ్లెక్సీలను తగిలించి ర్యాలీ నిర్వహించారు. గుత్తిలో ఉపాధ్యాయులు వినూత్న నిరసన తెలిపారు. పామిడిలో జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హిందూపురంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, విశాలాంధ్ర పరిరక్షణ సమితి, చిలమత్తూరులో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. కదిరిలో జేఏసీ నాయకులు భిక్షాటన చేశారు. స్పేస్ కళాశాల విద్యార్థులు రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా 205 జాతీయ రహదారిపై ఆట పాటలతో హోరెత్తించారు. నల్లచెరువులో గ్రామస్తులు, తలుపులలో విద్యుత్ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. కళ్యాణదుర్గంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వీరశైవ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో ఉద్యోగులు గుగ్గిళ్లు అమ్ముతూ నిరసన తెలిపారు. జేఏసీ నాయకులు రహదారిపై మొక్కలు నాటారు. అమరాపురంలో ఉపాధ్యాయలు దీక్షలు కొనసాగిస్తూనే... రహదారిపై కప్పగంతులు వేస్తూ నిరసన తెలిపారు. సర్పంచ్‌లందరూ సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. పుట్టపర్తిలో సమైక్య వాదులు గడ్డి తింటూ నిరసన తెలిపారు. కొత్తచెరువు, ఓడీచెరువు, అమడగూరు మండలాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
అమడగూరులో అంగన్‌వాడీ వర్కర్లు, క్రైస్తవులు ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తిలో పంచాయతీ కార్మికులు సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. పెనుకొండలో జేఏసీ ఆధ్వర్యంలో తెలుగుతల్లి, గాంధీజీ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. 50 మంది జేఏసీ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. రొద్దంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపైనే పరీక్షలు రాశారు. సోమందేపల్లిలో వెలిదడకల గ్రామస్తులు నిరసన తెలిపారు. రాయదుర్గంలో ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రక్తంతో సంతకాల సేకరణ చేసి.. బ్యానర్ కట్టారు. సూర్యసేవాసమితి ఆధ్వర్యంలో రోడ్డుపై పొర్లు దండాలు పెట్టారు. పాలిటెక్నిక్ విద్యార్థులు, సిబ్బంది, విద్యుత్ ఉద్యోగులు, అభ్యుదయ పాఠశాల విద్యార్థులు, కమ్మ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. రిలే దీక్షల్లో 500 మంది ఉపాధ్యాయులు పాల్గొని నిరసన తెలిపారు. కణేకల్లులో సమైక్యాంధ్రపై సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. రాప్తాడులో ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులకు సమైక్యాంధ్రపై అవగాహన కల్పించారు. గార్లదిన్నెలో జేఏసీ నాయకులు సోనియా దిష్టి బొమ్మకు సమాధి కట్టి పిండ ప్రదానం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు పూజారి మాధవ ఆమరణ దీక్ష చేపట్టారు. శింగనమల, నార్పలలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు.
తాడిపత్రిలో ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. ఆర్టీసీ కార్మికులు టోపీలు ధరించి ర్యాలీ చేశారు. పెద్దవడుగూరులో ఎంపీడీఓ, కార్యదర్శులు, సర్పంచుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రైతు సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. పెద్దపప్పూరులో ఉద్యోగ జేఏసీని ఎన్నుకున్నారు. ఉరవకొండ మండలం నింబగల్లులో వైఎస్సార్‌సీపీ నాయకులు జలదీక్ష చేశారు. ఉరవకొండలోని బ్యాంకులను విద్యార్థి జేఏసీ నాయకులు బంద్ చేయించారు. వజ్రకరూరులో సమైక్యవాదులు బైక్ ర్యాలీ చేశారు. బెళుగుప్ప, విడపనకల్లు మండలాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా సర్పంచ్‌లు తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు.