ఎర్రచందనం వేలం వచ్చే నెల 6కు వాయిదా
ఆదాయంపై సర్కారు లెక్కలు తారుమారు
కొనుగోలుకు ఆసక్తి చూపని అంతర్జాతీయ వ్యాపారులు
ధరలపై చర్చించడానికి చైనాకు ప్రభుత్వ బృందం
అవసరమైతే ధరలు తగ్గించి అమ్మాలని యోచన
విజయవాడ బ్యూరో: ఎర్రచందనం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రుణ మాఫీకి ఉపయోగించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనాలు తారుమారయ్యాయి. మార్కెట్‌లో ఎర్రచందనానికి మంచి డిమాండ్ ఉందని, తొలి విడతగా 4,160 టన్నులను వేలం వేస్తే రూ. 500 కోట్లకు పైగా ఆదాయం వస్తుందన్న అంచనాతో అటవీశాఖ అధికారులు టెండర్లు పిలిచారు. టెండర్లకు ఈనెల 19 వరకు గడువుంది. అయితే, అంతర్జాతీయ వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో ఎర్రచందనం వేలాన్ని ప్రభుత్వం వచ్చేనెల 6వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా ఎర్రచందనం వ్యాపారులతో ధరలపై చర్చించడానికి చైనాకు ఓ బృందాన్ని పంపుతోంది. చైనాలోనూ అంత డిమాండ్ లేకపోతే ప్రభుత్వం నిర్ణయించిన ధరలను తగ్గించి కొనుగోలుదారులను ఆకర్షించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎర్రచందనం ఎ-గ్రేడ్ ధర టన్నుకు రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షలు, బి-గ్రేడ్‌కు రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలు, సి-గ్రేడ్‌కు రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలు వస్తుందనే సమాచారం ఉందనీ.. కానీ టెండర్లలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోందని అటవీశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వాస్తవంగా ఈ ధర ఉందా? లేక కొనుగోలుదారులు రింగ్ అయి ధర రాకుండా చేస్తున్నారా అనే విషయాలను కూడా చైనా పర్యటనలో తెలుసుకొంటామన్నారు.
మొత్తం అమ్మితే రూ. 20 వేల కోట్ల ఆదాయం!
కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అటవీ శాఖ గోడౌన్లలో వివిధ గ్రేడ్లకు చెందిన సుమారు 10,500 టన్నుల ఎర్ర చందనం దుంగలు ఉన్నట్లు అధికారులు లెక్కేశారు. అంతర్జాతీయ మార్కెట్లో అమ్మితే సుమారు రూ. 20 వేల కోట్లు వస్తుందని అంచనా వేశారు. దీంతో యుద్ధప్రాతిపదికన ఎర్రచందనాన్ని అమ్మాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబానాయుడు ఆదేశించారు. విక్రయ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీఎస్ లిమిటెడ్‌కు అప్పగించారు. తొలివిడతగా 4,160 టన్నులు అంతర్జాతీయ టెండర్లలో విక్రయించడానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో ఎ-గ్రేడ్ 39 టన్నులు, బి-గ్రేడ్ 400 టన్నులు, సి-గ్రేడ్ 3,721 టన్నులు ఉంది. ఎ-గ్రేడ్‌కు రూ. 12 లక్షలు, బి గ్రేడ్‌కు రూ. 10 లక్షలు, సి-గ్రేడ్‌కు రూ. 8 లక్షలు, నాన్ గ్రేడ్‌కు రూ. 7 లక్షల ప్రారంభ ధర నిర్ణయించారు. చైనా, హాంకాంగ్, సింగపూర్, జపాన్ దేశాలకు చెందిన పలువురు వ్యాపారులు, సంస్థల ప్రతినిధులు కడప, తిరుపతి, నెల్లూరు గోడౌన్లలో ఉన్న దుంగలను పరిశీలించారు. వీరి దృష్టంతా ఎ-గ్రేడ్ పైనే ఉన్నప్పటికీ, ఇదికూడా ఆశించినంత నాణ్యతతో లేదనే అభిప్రాయంతో చాలా మంది ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనడానికి ఉత్సాహం చూపలేదు. ఎ, బి గ్రేడ్ రకాల కొనుగోలుకు చైనా, హాంకాంగ్ దేశాలకు చెందిన కొందరు ఆన్‌లైన్‌లో టెండర్లు దాఖలు చేసినప్పటికీ వారి సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంది. భారీ మొత్తంలో ఉన్న సీ-గ్రేడ్‌పై ఎవరూ ఆసక్తి చూపడంలేదు. దీంతో ప్రభుత్వం టెండర్లను వాయిదా వేసి, చైనాకు ఓ బృందాన్ని పంపుతోంది.