విజయవాడ : వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా అంతర్జాతీయ కాల్స్ మళ్లిస్తోన్న ముఠా గుట్టురట్టయింది. జమ్మూ కశ్మీర్‌లోని మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి అందిన పక్కా సమాచారంతో ఏపీ పోలీసులు దాడులు నిర్వహించారు. విజయవాడలోని గుణదల కేంద్రంగా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాల్స్ వెళుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. జమ్మూ కశ్మీర్‌లో పనిచేసే సైనిక బలగాల నుంచి సున్నితమైన భద్రతా సమాచారాన్ని సేకరించేందుకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ నెట్‌వర్క్‌ను వాడుకుంటున్నట్లు సమాచారం. భారత సైనికాధికారులుగా భద్రతా సిబ్బందిని మభ్యపెట్టేందుకు ఇంటర్నెట్ కాల్స్‌ను వాడుతున్నట్లు గుర్తించారు.
దుండగులు విదేశాల నుంచి కాల్స్ చేసినా, భారతీయ ఫోన్ నంబర్లు, భద్రతా బలగాలు వాడే ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నట్టు కనిపించేలా టెక్నాలజీని వాడినట్టు గుర్తించారు. సిమ్ బాక్స్‌ల సహకారంతో ఇంటర్నెట్ కాల్స్‌ను సాధారణ కాల్స్‌గా మార్చి వాటిని దుండగులు దేశరక్షణ సమాచారం సేకరించేందుకు ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నిఘా వర్గాలతో పాటు కేంద్ర గూఢాచార వర్గాలు ఈ కుట్రను ఛేదించాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 230 సిమ్ కార్డులు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. వాయిస్ ఓవర్ ప్రొటో కాల్ కాల్స్ కు సంబంధించిన విచారణ జరుగుతుందని సీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment