కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో నూకలు చెల్లాయి. ఇక జనం పార్టీని ఆదరించే పరిస్థితి లేదు. పార్టీని వీడటం మంచిది. ఈ విషయంపై సమగ్ర చర్చ జరగాలి.
కాంగ్రెస్ ఖతం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో నూకలు చెల్లాయి. ఇక జనం పార్టీని ఆదరించే పరిస్థితి లేదు. పార్టీని వీడటం మంచిది. ఈ విషయంపై సమగ్ర చర్చ జరగాలి. అధిష్ఠానం చేసిన ఘోర తప్పిదానికి మనం బలవ్వకూడదంటే పార్టీని వీడక తప్పదని పలువురు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు. టీనోట్ ఆమోదం నేపథ్యంలో శుక్రవారం ఉద యం నుంచి మధ్యాహ్నం వరకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు తనయుడు రామమనోహర్ పలువురితో చర్చలు జరిపారు. ఇంటి వద్ద, డీసీసీ కార్యాలయంలో పట్టణ నాయకులతో మాట్లాడారు. పరిస్థితి చేయి దాటకముందే తగిన నిర్ణయం తీసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు.
పార్టీని వీడాల్సిందేనని, ప్రజల మనోభావాలకు అనుగుణంగా అడుగులు వేయాలని ఈ చర్చల్లో పాల్గొన్న పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. అయితే పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడేది లేదని శిమ్మ రాజశేఖర్ వంటి ఒకరిద్దరు పేర్కొన్నారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఎంవీ పద్మావతి మాత్రం నోరు విప్పలేదు. దీన్ని బట్టి ఆమె పార్టీ నిర్ణయాన్ని సమర్థించినట్లు భావించాల్సి వస్తుందని సమైక్యవాదులు చెబుతున్నారు. కాగా డీసీసీ అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్ కూడా కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయని చెబుతున్నారు. మరోవైపు అరసవల్లి దేవస్థానం పాలకమండలి సభ్యులు పసగాడ రామకృష్ణ, తెలుగు సూర్యనారాయణ తమ పదవులకు సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం వచ్చిన తర్వాత చర్చించి చాలామంది పార్టీకి గుడ్‌బై చెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకమైంది. ఆ రెండు మండలాలకు చెందిన నాయకులు పార్టీకి, పదవులకు శుక్రవారం మూకుమ్మడి రాజీనామాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలతో శ్రీకాకుళం నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అయినట్లే. త్వరలో జిల్లా వ్యాప్తంగా రాజీనామాలు వెల్లువెత్తనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా పార్టీకి రాజీనామాలు చేయాలనే ఆలోచనలో నాయకులు ఉన్నారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా బంద్ సందర్భంగా ప్రజలు, సమైక్యవాదులు కాంగ్రెస్ పైనే ప్రధానంగా ఆగ్రహం ప్రదర్శించారు. డీసీసీ కార్యాలయంపై ఉదయం రాళ్లు రువ్వి అద్దాలు పగులగొట్టారు. మళ్లీ సాయంత్రం మరోసారి దాడికి ప్రయత్నించి ముట్టడించిన పోలీసులు అడ్డుకున్నారు. మంత్రులు కృపారాణి, శత్రుచర్ల, కోండ్రు మురళీల క్యాంప్ కార్యాలయాలను సైతం ఆందోళనకారులు ముట్టడించి ఫ్లెక్సీ చించేశారు. శత్రుచర్ల కార్యాలయం వద్ద పోలీసులు స్వల్ప లాఠీచార్జీ కూడా చేశారు.