టీడీపీలోకి జంప్
సాక్షి, కాకినాడ :ఎన్నికల అనంతరం తొలిసారిగా జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు పచ్చచొక్కాలు వేసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలు కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్య రాజు), కేవీ రవికిరణ్‌వర్మతో పాటు కాంగ్రెస్ తరఫున గవర్నర్ కోటాలో మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న అంగూరి లక్ష్మీశివకుమారి, బలసాలి ఇందిర హైదరాబాద్‌లో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. వీరిలో ఇందిర, లక్ష్మీ శివకుమారికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితాన్ని ప్రసాదించారు. శాసన మండలి ఏర్పడిన తర్వాత మత్స్యకారులకు అవకాశం కల్పించాలని మహానేత నిర్ణయించారు. అదే సమయంలో మత్స్యకార వర్గానికి చెందిన బలసాలి ఇందిరకు అవకాశమివ్వాలని అప్పటి రాష్ర్ట మంత్రి, దివంగత జక్కంపూడి రామ్మోహనరావు సూచించారు. కనీస రాజకీయానుభవం కూడా లేకపోయినప్పటికీ జక్కంపూడి సూచన మేరకు ఇందిరకు వైఎస్ అవకాశం కల్పించారు.
గవర్నర్ కోటాలో ఇందిరకు మండలిలో చోటు కల్పించారు. లాటరీలో ఇందిరకు ఆరేళ్ల పదవీ కాలం వరించింది. మహానేత మరణం తర్వాత కాంగ్రెస్‌లోనే కొనసాగిన ఇందిర.. గడిచిన ఎన్నికల ముందు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వెంట నడిచి జై సమైక్యాంధ్ర పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఎన్నికల్లో ఆ పార్టీ కనుమరుగై పోవడంతో ప్రస్తుతం అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ పంచన చేరారు.జిల్లా మహిళా సంఘాల సమాఖ్య అధ్యక్షురాలైన అంగూరి లక్ష్మీశివకుమారిలో నాయకత్వ లక్షణాలు గుర్తించి ప్రోత్సహించింది కూడా మహానేత వైఎస్సారే. రాజమండ్రిలో జరిగిన గోదావరి జిల్లాల మహిళా సంఘాల సమైఖ్య సమావేశంలో లక్ష్మీశివకుమారిలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన వైఎస్.. ఆ కీలకసమావేశాన్ని నిర్వహించే అవకాశాన్ని ఆమెకు అప్పగించారు.
యాంకరింగ్ చేస్తూ నాటి సమావేశంలో మహిళా సంఘాల కార్యకలాపాలను ప్రెజెంట్ చేసిన తీరు చూసి ప్రశంసించిన వైఎస్ కచ్చితంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ మరణం తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా శివకుమారిని ప్రోత్సహించి గవర్నర్ కోటాలో అవకాశం కల్పించారు. తొలుత పదవీ కాలం రెండేళ్లకే పరిమితం కాగా, గతేడాది ఆమె పదవీ కాలం ముగియడంతో ఎమ్మెల్యే కోటాలో మరోసారి అవకాశం కల్పించారు.ఒకప్పుడు దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి హయాంలో టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషించిన చైతన్య విద్యాసంస్థల అధినేత కేవీవీ సత్యనారాయణరాజు.. ఆ తర్వాత వైఎస్సార్ నాయకత్వానికి ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరారు. తాను టీచర్ ఎమ్మెల్యేగా, తన కుమారుడు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పార్టీలకతీతంగా వ్యవహరించాల్సిన వీరు ప్రస్తుతం టీడీపీలో చేరారు.
శనివారం చంద్రబాబు సమక్షంలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్సీల్లో నలుగురు మన జిల్లాకు చెందిన వారే ఉన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్ గిరీ కోసమే చైతన్యరాజు తన కుమారుడితో పాటు జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్పించినట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తరఫున మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇందిర, లక్ష్మీశివకుమారితో పాటు కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన చైతన్యరాజు, రవికిరణ్‌వర్మ టీడీపీలో చేరడం వారి నైజాన్ని తేటతెల్లం చేసిందని కాంగీయులు మండిపడుతున్నారు.